30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం.. శాస్త్రోక్తంగా పూజలు చేయనున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఈ నెల 30న ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించే పూజా కార్యక్రమాల్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొంటారు.

Advertisement
Update:2023-04-05 08:51 IST

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ఈ నెల 30న ప్రారంభించనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంగా దీనికి పేరు పెట్టారు. ఈ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో కొత్త సచివాలయం ప్రారంభం, అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశనం చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఈ నెల 30న ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించే పూజా కార్యక్రమాల్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం పండితులు నిర్ణయించిన మూహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో ప్రభుత్వం వెల్లడించనున్నది. సెక్రటేరియట్ ప్రారంభం అయిన తర్వాత ముందుగా సీఎం కేసీఆర్ తన చాంబర్‌లో ఆసీనులవుతారని తెలుస్తున్నది. ఆ తర్వాత మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో సిబ్బంది, సచివాలయ సిబ్బంది తమ తమ చాంబర్లలో కూర్చుంటారు.

సెక్రటేరియట్ ప్రారంభ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, మేయర్లందరికీ ఆహ్వానాలు పంపాలని కేసీఆర్ సూచించారు. దాదాపు 2,500 మంది సచివాలయం ప్రారంభానికి హాజరవుతారని, వీరికి అవసరమైన భోజనాల ఏర్పాట్లు కూడా చేయాలని సీఎం ఆదేశించారు.

విగ్రహావిష్కరణకు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిథి..

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఈ నెల 14న తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించనున్నది. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సీఎం కేసీఆర్ మంగళవారం చేసిన సమీక్షలో ఈ విషయం స్పష్టం చేశారు. విగ్రహావిష్కరణకు సంబంధించి పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి 40వేల మంది హాజరవుతారని కేసీఆర్ చెప్పారు. ప్రతీ నియోజకవర్గం నుంచి 300 మందినిక ప్రత్యేకంగా ఆహ్వానించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

విగ్రహావిష్కరణకు సంబంధించిన పూర్తి కార్యక్రమాన్ని సీఎస్ శాంతి కుమారి పర్యవేక్షిస్తారని సీఎం చెప్పారు. విగ్రహావిష్కరణ అనంతరం అక్కడే ఒక సభ నిర్వహించనున్నారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పకారుడు రామ్ వంజి సుతార్‌ను ఆ కార్యక్రమంలో సన్మానించనున్నారు. ఈ సభ కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సిటి కమిషనర్ సీవీ ఆనంద్‌కు చెప్పారు. అలాగే 40 వేల మందికి భోజనాలు, లక్షన్నర మందికి సరిపడే మజ్జిగ ప్యాకెట్లు, నీళ్లు అందుబాటులో ఉంచాలని.. షామియానాలు, కుర్చీలు అందుబాటులో ఉంచాలని కేసీఆర్ చెప్పారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా విగ్రహావిష్కరణ జరిగేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Tags:    
Advertisement

Similar News