ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు.. తీన్మార్ మల్లన్నపై మరో కేసు నమోదు

తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలును బ్రహ్మీ ట్రోల్స్ అనే యూట్యూబ్ పేజీ, ఫేస్‌బుక్ పేజీలో వాడారని.. దానికి సంబంధించిన క్లీప్స్‌ను కూడా పోలీసులకు అందజేశారు.

Advertisement
Update:2023-03-23 07:41 IST

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌పై మరో కేసు నమోదైంది. ఈడీ విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, ఆమెను కించపరిచేలా మాట్లాడాడంటూ శ్రీకాంత్ అనే వ్యక్తి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేశారు. తీన్మాన్ మల్లన్నతో పాటు బ్రహ్మీ ట్రోల్స్ అనే పేజి నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు.

తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలును బ్రహ్మీ ట్రోల్స్ అనే యూట్యూబ్ పేజీ, ఫేస్‌బుక్ పేజీలో వాడారని.. దానికి సంబంధించిన క్లిప్స్‌ను కూడా పోలీసులకు అందజేశారు. వాటిని పరిశీలించిన పోలీసులు.. అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజమేనని నిర్దారించుకొని మల్లన్న, బ్రహ్మీ ట్రోల్స్ పేజీలపై కేసులు నమోదు చేశారు.

కాగా, ఇప్పటికే రాచకొండ ఎస్టీవో పోలీసులు ఒక దాడి కేసులో చింతపండు నవీన్ కుమార్‌తో పాటు మరి కొందరిని అరెస్టు చేశారు. ఈ కేసులో మల్లన్నతో పాటు వారందరికీ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో మేడిపల్లి పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో మల్లన్నపై రెండు కేసులు నమోదయ్యాయి.

ఇటీవల కొందరు.. తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీనిపై మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత దాడి విషయంలో తప్పుడు సమాచారం అందినట్లు తెలిసింది. అంతే కాకుండా మల్లన్న కూడా కొందరు వ్యక్తులపై దాడి చేసినట్లు గుర్తించారు. క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. మల్లన్నతో పాటు మరి కొందరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి.. మల్లన్న విడుదల అయిన తర్వాత విచారణ జరిపే అవకాశం ఉన్నది. 

Tags:    
Advertisement

Similar News