బండి కి షాక్ ఇచ్చిన ఈటెల‌!

అధిష్టానం సంజయ్ ని కరీంనగర్ నుంచే పోటీ చేయాలని ఆదేశించిందట. ఈ విషయంలో ఈటెల‌ పై చేయి సాధించడంతో షాక్ కు గురైన సంజయ్ తప్పనిసరి పరిస్థితుల్లో కరీంనగర్ నుంచి మంత్రి గంగులపై పోటీకి సిద్దమయ్యారట.

Advertisement
Update:2023-01-30 19:20 IST

తెలంగాణ బీజేపీలో కొంత కాలంగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి, ఎమ్మెల్యే ఈటెల‌ రాజేందర్ కు మధ్య పరోక్ష యుద్దం జరిగుతోందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏ సమస్య అయితే గొడవలు రేపిందో ఆ విషయంపై ఈటెల‌దే పైచేయి అయ్యిందట. దాంతో బండి షాక్ కు గురయ్యారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. గతంలో కరీంనగర్ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర ఉన్నందువల్ల ఈ సారి వేములవాడ నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ తన బలం పెంచుకునే పనిలో ఉన్నారు. వేములవాడ కార్యకర్తలతో రెగ్యులర్ టచ్ లో ఉండటమే కాకుండా, అక్కడ తరచుగా ఏదో కార్యక్రమం చేపడుతున్నారు సంజయ్. తాను రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి తాను కోరుకుంటున్న వేములవాడ టికట్ గ్యారంటీగా వస్తుందని, పార్టీ అధిష్టానం తన మాటకు విలువనిస్తుందని భావిస్తూ వచ్చారు బండి.

మరో వైపు ఈటెల‌ రాజేందర్ తనతో పాటు టీఆరెస్ నుండి బీజేపీలో చేరిన మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమకు వేములవాడ బీజేపీ టికట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఉన్నాడు. పైగా పార్టీలో చేరినప్పుడే అధిష్టానంతో వేముల వాడ టికట్ పై హామీ తీసుకున్నాడని సమాచారం. అందువల్ల ఈటెల‌ భరోసాతో వేములవాడ టికట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్న ఉమ వేముల వాడలో తనపని తాను చేసుకుంటున్నారు.

దీంతో వేముల‌వాడ సీటు విష‌యంలో బండి వ‌ర్సెస్ ఈటెల‌గా సీన్ మారిపోయింది. పైగా సీట్ల‌పై వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రేం చెప్పినా పార్టీ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అంటూ ఈటెల విష‌యంలో బండి సంజ‌య్ గ‌తంలో బహిరంగంగా, ఘాటుగానే స్పందించారు. నాటి నుండి ఇద్దరి మధ్య ఆ పంచాయితీ నడుస్తోంది. ఎప్పుడు, ఎక్కడ వీలు దొరికినా ఒకరిపై ఒకరి పరోక్ష వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానంతో ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న ఈటెల‌ తనకు కావాల్సిన సీట్ల విషయంలో పట్టుబడుతూ వస్తున్నారట. చివరకు వేములవాడ సీటును తుల ఉమకే ఇవ్వడానికి అధిష్టానం ఒప్పుకుందని సమాచారం. అంతేకాక‌ ఎల్లారెడ్డి నుండి ఈటెల అనుచ‌రుడు ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డికి సీటు ఖాయం చేయించుకున్నారట. మ‌రికొన్ని చోట్ల కూడా త‌న వ‌ర్గానికి టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఈటెల ఉన్నార‌ని, అలా సీట్లు ఇస్తే బీఆర్ఎస్ (BRS) నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్య‌త త‌న‌దని ఈటెల అధిష్టానానికి మాటిచ్చిన‌ట్లు బీజేపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేపథ్యంలో అధిష్టానం సంజయ్ ని కరీంనగర్ నుంచే పోటీ చేయాలని ఆదేశించిందట. ఈ విషయంలో ఈటెల‌ పై చేయి సాధించడంతో షాక్ కు గురైన సంజయ్ తప్పనిసరి పరిస్థితుల్లో కరీంనగర్ నుంచి మంత్రి గంగులపై పోటీకి సిద్దమయ్యారట. ఇప్పటి వరకూ అన్నీ తానై తెలంగాణ బీజేపీని నడిపిస్తున్న బండి సంజయ్ ఈటెల‌ విషయంలో వెనకడుగు వేయాల్సి రావడం పట్ల ఆగ్రహంగా ఉన్నాడట.

Tags:    
Advertisement

Similar News