'ఫ్లూట్, జింక ముందు ఊదు..సింహం ముందు కాదు'

అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసి తాము అధికారంలోకి రావడం లో సక్సెస్ అయిన బీజేపీకి కేసీఆర్ కొరకరాని కొయ్యలా మారారు. రెబల్ స్టార్ వంటి మమతా బెనర్జీ నోరును కూడా నొక్కగలిగిన బీజేపీకి కేసీఆర్ ను ఎదుర్కోవడం ఎలా అన్నది అంతుచిక్కడం లేదు.

Advertisement
Update:2022-11-23 12:51 IST

ఫెడ‌ర‌ల్ వ్య‌వస్థ‌కు తూట్లు పొడిచేలా వ్య‌వ‌హ‌రిస్తున్న బిజెపికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రంలోని క‌మ‌లం పార్టీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో అడ్డంగా దొరికిపోయి చిక్కుల్లో ఇరుక్కుపోయిన బిజెపికి ఇప్పుడు ఏం చేయాలో తోచ‌డంలేదు. బిజెపి లో కీల‌క నేత‌గా ఉన్న బిఎల్ సంతోష్ కు కోర్టు నోటీసులు ఇప్పించి విచార‌ణ‌కు హాజ‌రయ్యేలా చేసిన ముఖ్య‌మంత్రి కెసిఆర్ తెగువ‌ను బిజెపి నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. కెసిఆర్ ఇంత‌దూరం వెళ‌తార‌ని ఊహించి ఉండ‌లేద‌ని అనిపిస్తున్న‌ది. ఈ సంఘ‌ట‌న‌ల‌తో ఒక వైపు దేశ‌వ్యాప్తంగా ప‌రువుపోయిన వైనం, మ‌రోవైపు కెసిఆర్ ను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నామ‌నే అస‌హ‌నంతో బిజెపి నేత‌లు ర‌గిలిపోతున్నారు. అందుకే త‌మ వ‌ద్ద రెడీగా ఉండే అస్త్రాలు ఈడీ, సిబిఐ సంస్థ‌ల‌ను పురికొల్పుతూ తెలంగాణ‌లోని అధికార పార్టీ నాయ‌కులు, మ‌ద్ద‌తుదార్ల‌పై దాడులు చేయిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దీనిలో భాగ‌మే మంత్రి మ‌ల్లారెడ్డి, ఆయ‌న బంధువుల ఇళ్ళు, కాలేజీలు త‌దిత‌ర ప్ర‌దేశాల్లో ఊపిరి స‌ల‌ప‌ని దాడులు జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్నారు. ఇంకా మ‌రి కొంద‌రు అధికార పార్టీ నేత‌ల‌పై కూడా ద‌ర్యాప్తు సంస్థ‌ల దాడులు జ‌ర‌గవ‌చ్చ‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ కెసిఆర్ దూకుడును క‌ట్ట‌డి చేసేందుకు అన‌డంలో సందేహంలేదు.

తెలంగాణ లో ప‌రువు ద‌క్కించుకునేందుకు ప‌శ్చిమ బెంగాల్ లో అమ‌లు చేసిన వ్యూహ‌మే అనుస‌రించాల‌ని బిజెపి భావిస్తున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. కొంత‌కాలం క్రితం వ‌ర‌కూ కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వంతో పాటు ఆ పార్టీ వైఖ‌రిపైనా ఒంటికాలిపై లేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించేవారు బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. ఆమె మాట‌ల దాడితో రాష్ట్రంలోనూ, కేంద్ర నాయ‌కుల‌నూ ఉక్కిరిబిక్కిరి చేసేది. ఈ త‌రుణంలో రాష్ట్ర విద్యా శాఖ‌లో ఉద్యోగాల నియామ‌కాల విష‌యంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ మంత్రి పార్థా చ‌ట‌ర్జీని, ప‌శ‌వుల స్మ‌గ్లింగ్ కుంభ‌కోణం అంటూ మంత్రి అనుబ్ర‌త మొండ‌ల్ ను ఈడీ దాడుల ద్వారా అరెస్టు చేయించారు. యాదృచ్ఛిక‌మో మ‌రేదైనా కార‌ణ‌మో తెలియ‌దు కానీ ఈ ప‌రిణామాల త‌ర్వాత బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కేంద్రంపై కానీ, బిజెపి పై కానీ మునుప‌టి దూకుడును మాత్రం ప్ర‌ద‌ర్శించ‌డం లేదు.

అయితే ఇక్క‌డే బిజెపి కెసిఆర్ ను త‌క్కువ అంచ‌నా వేస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. రాజ‌కీయ చాణ‌క్యంలో పావులు క‌ద‌ప‌డంలోనూ, తాను వేసే ఎత్తులు చివ‌రివ‌ర‌కూ ఎవ‌రి ఊహ‌కు అంద‌ని రీతిలో వ్యూహాలు ర‌చించ‌డంలో కెసిఆర్ అందెవేసిన చేయి అని ఆయనను ఎరిగిన వారికి బాగా తెలుసు. కానీ బిజెపి ఎత్తుగ‌డ‌ల‌ను ముందుగానే ప‌సిగ‌ట్టిన కెసిఆర్ ఇప్ప‌టికే త‌మ‌ పార్టీ నేత‌ల‌కు ముందుగానే జాగ్ర‌త్త‌లు చెప్పారు. ఆయ‌న ఊహించిన‌ట్టుగానే మంత్రి మ‌ల్లారెడ్డి పై ఈడి దాడులు జ‌రిగాయి. ఈ నేపథ్యంలో కెసిఆర్ బృందం స‌మావేశ‌మై బిజెపి కి మ‌రోసారి ఝ‌ల‌క్ ఇచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది. బెంగాల్ లో మ‌మ‌త‌కు బ్రేక్ వేసిన‌ట్టు తెలంగాణ‌లో సాధ్యంకాద‌ని, బిజెపి కుయుక్తులు కెసిఆర్ ముందు సాగకుండా ఇప్ప‌టికే కెసిఆర్ క‌స‌ర‌త్తు పూర్తి చేశారంటున్నారు. 'ఫ్లూట్ జింక ముందు ఊదు..సింహం ముందు కాదు' అంటూ బిజెపి పై జోకులు పేలుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News