వరదల్లో కూలిపోయిన ఇండ్లకు గృహలక్ష్మి పథకం అమలు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

వర్షాల కారణంగా 139 గ్రామాలు ప్రభావితం అయ్యాయి. 7,870 కుటుంబాలను లోతట్టు ప్రాంతాల నుంచి పునారావాస కేంద్రాలకు తరలించాము. దాదాపు 27 వేల మంది కోసం రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

Advertisement
Update:2023-08-03 15:06 IST

రాష్ట్రంలో అకస్మాతుగా కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శాసన మండలిలో వరదల నష్టంపై ఆయన ప్రకటన చేస్తూ.. ప్రకృతి వైపరిత్యం కారణంగా 419 ఇండ్లు పూర్తిగా.. 7,505 ఇండ్లు పాక్షికంగా డ్యామేజ్ అయ్యాయి. వారికి నిబంధనల ప్రకారం డబ్బులు ఇవ్వడమే కాకుండా.. వారిలో అర్హులైన వారికి గృహ లక్ష్మి పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి సభలో వెల్లడించారు.

వర్షాల కారణంగా 139 గ్రామాలు ప్రభావితం అయ్యాయి. 7,870 కుటుంబాలను లోతట్టు ప్రాంతాల నుంచి పునారావాస కేంద్రాలకు తరలించాము. దాదాపు 27 వేల మంది కోసం  రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ప్రశాంత్ రెడ్డి చెప్పారు. వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏడుగురు ప్రత్యేక అధికారులను సీఎం కేసీఆర్ నియమించినట్లు మంత్రి చెప్పారు. ప్రతీ జిల్లా హెడ్ క్వార్టర్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

మిషన్ కాకతీయ కాపాడింది..

మిషన్ కాకతీయ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీని కారణంగా వరద ప్రభావం చాలా వరకు తగ్గిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. మిషన్ కాకతీయ కారణంగా అన్ని చెరువులకు కట్టలు పటిష్టం చేశాము. అలాగే అలుగులను కూడా కొత్తగా కట్టినట్లు మంత్రి చెప్పారు. దాని వల్లే భారీ వరదలు వచ్చినా.. చెరువులు తట్టుకొని నిలిచినట్లు మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో 40 వేల చెరువులు ఉండగా.. వరదలు వచ్చిన ప్రాంతాల్లో దాదాపు 20 వేల చెరువులు ఉన్నాయని మంత్రి చెప్పారు. వీటిలో గండ్లు పడ్డవి 756 చెరువులు అని మంత్రి పేర్కొన్నారు. వాటిలో చాలా చెరువుల గండ్లు చిన్నవే అని మంత్రి వివరించారు. అంటే గండ్లు పడ్డవి కేవలం 4 శాతం కంటే తక్కువే అని మంత్రి పేర్కొన్నారు. మిషన్ కాకతీయ జరిగి ఉండకపోతే 30 శాతానికి ఈ నష్టం పెరిగేదని.. మిషన్ కాకతీయ మనల్ని బతికించిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 76 చెరువులను పునరుద్దరించినట్లు మంత్రి వెల్లడించారు. మిగిలిన వాటి పనులు కూడా జరుగుతున్నాయని అన్నారు.

రాష్ట్రంలో 768 ప్రాంతాల్లో బ్రిడ్జిలు, కల్వర్టులు, రోడ్లు డ్యామేజ్ అయినట్లు మంత్రి తెలిపారు. వీటిలో 523 ప్రాంతాల్లో తాత్కలికంగా మరమ్మతులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. వర్షాలు, వరదలు పూర్తిగా ముగిసిన తర్వాత రోడ్లు, కల్వర్టుల పునరుద్దరణ పూర్తి స్థాయిలో చేపడతామని అన్నారు. ఇరిగేషన్ శాఖకు తాత్కాలికంగా రూ.30 కోట్లు, శాశ్వత పునరుద్దరణకు రూ.180 కోట్లు అవసరం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్‌కు తాత్కాలికంగా రూ.253కోట్లు.. శాశ్వత పునరుద్దరణ పనులకు రూ.1,311 కావాలని అంచనా వేసినట్లు మంత్రి చెప్పారు.

పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో 697 రోడ్లు పాడయ్యాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.187 కోట్లు, శాశ్వత పునరుద్దరణకు రూ.1,339 కావాలని అంచనాలు పంపించినట్లు మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ కూడా వరదల కారణంగా ప్రభావితం అయ్యింది. 64 గ్రామాల్లో పైపులకు నష్టం కలిగింది. 1199 ప్రాంతాల్లో పైపులు పాడయ్యాయి. వీటిని 100 శాతం పునరుద్దరించినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ శాఖకు 773 గ్రామాల్లో ఇబ్బంది ఏర్పడింది. 769 గ్రామాల్లో పునరుద్దరించారు. కేవలం 4 గ్రామాల్లోనే విద్యుత్ పునరుద్దరించలేదు. 23 వేల పోల్స్ పడిపోతే.. వాటిని తిరిగి నిలబెట్టినట్లు మంత్రి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News