చిన్న పొరపాటు జరగకుండా భూ భారతి చట్టం అమలు
ధరణి ద్వారా ఆక్రమించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందన్న మంత్రి పొంగులేటి
భూ భారతి చట్టం కోసం చాలా కష్టపడ్డామని, ఫిబ్రవరి 15 నుంచి 28 లోపు ఆ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో భూ భారతి చట్టం అమలుకు విధివిధానాలు ఉన్నాయన్నారు. చిన్న పొరపాటు కూడా జరగకుండా భూ భారతి చట్టం అమలు చేస్తామన్నారు. ధరణిని ఉపయోగించుకుని తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ అప్పీల్ అథారిటీ పూర్తిగా తొలిగించారు. భూ భారతి చట్టంలో ల్యాండ్ అప్పీల్ అథారిటీని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ధరణి ద్వారా ఆక్రమించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందన్నారు.
అంతకుముందు ఖమ్మం జిల్లా మల్లెమడుగులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నారు. కొండలు, గుట్టలకు ఈ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్బంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామన్నారు. ఈ నెల 26న మరో నాలుగు పథకాలు అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.