ఆ అధికారి పేరు హరికృష్ణ.. సస్పెండ్ చేసేశాం..!

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై విస్తృత స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హరికృష్ణ అనే అధికారిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు.

Advertisement
Update:2023-08-13 14:29 IST

హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ అధికారిపై వచ్చిన ఆరోపణల విష‌యంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సదరు అధికారిని సస్పెండ్ చేసింది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై విస్తృత స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హరికృష్ణ అనే అధికారిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి వాస్తవాలు బహిర్గతం చేస్తామన్నారు. హరికృష్ణ తప్పు చేసినట్టు తేలితే.. కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పారు. విషయం తెలిసిన వెంటనే.. ఈ విషయంలో చర్యలు తీసుకున్నామన్నారు.

అంతకుముందు ఓ డెయిలీ న్యూస్ పేపర్ లో ఈ విషయానికి సంబంధించి ప్ర‌చురించిన వార్తపై ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఘటన తనను కలచివేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరగరాదని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ట్వీట్ కు స్పందించిన మంత్రి, విచారణకు ఆదేశించిన విషయాన్ని తెలిపారు.

ఇదంతా జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను విధుల నుంచి ప్రభుత్వం తప్పించేసింది. అవసరమైతే మరింత కఠినంగా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టుగా తెలుస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారిని స‌స్పెండ్ చేసిన విష‌యాన్ని, విచార‌ణ ప్ర‌క్రియ‌ను, ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించిన తీరును వివరించారు. 

Tags:    
Advertisement

Similar News