మమ్మల్ని భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే
ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్‌ఎస్‌కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఫైర్
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అరెస్టును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖండించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు. ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్‌ఎస్‌కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలతో మాట్లాడినా నేతలను అదుపులోకి తీసుకుంటున్నారన్నారు. ప్రజా తిరుగుబాటు అణచివేతకు అప్రజాస్వామిక చర్యలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. తమను భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఎంత అణిచివేసే ప్రయత్నం అంత పోరాటం చేస్తామన్నారు. లగచర్లలో అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.