హెచ్ఎం ప్రమోషన్ వద్దనుకుంటే రాసివ్వండి.. విద్యా శాఖ కీలక నిర్ణయం

జీహెచ్ఎం పోస్టు మల్టీ జోన్ కావడంతో చాలా మంది పదోన్నతులు లభించినా.. వాటిని తీసుకోవడం లేదు. దీంతో వందలాది గెజిటెడ్ హెఎంల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి.

Advertisement
Update:2023-09-14 06:35 IST

ఉపాధ్యాయుల ప్రమోషన్ల సమయంలో ఎవరికైనా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ లభించినా చాలా మంది తీసుకోవడం లేదు. ప్రస్తుతం పని చేస్తున్న ప్రదేశం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందనే కారణంతో చాలా మంది జీహెచ్ఎం ప్రమోషన్లను వదిలేసుకుంటున్నారు. దీంతో చాలా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఎవరైనా ప్రమోషన్ వద్దని అనుకుంటే 'నాట్ విల్లింగ్' ఆప్షన్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సీనియర్లు పదోన్నతి వద్దనుకుంటే తర్వాత ఉండే సీనియర్లకు అవకాశం ఇస్తామని ప్రకటించింది.

జీహెచ్ఎం పోస్టు మల్టీ జోన్ కావడంతో చాలా మంది పదోన్నతులు లభించినా.. వాటిని తీసుకోవడం లేదు. దీంతో వందలాది గెజిటెడ్ హెఎంల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో అన్ని హెచ్ఎం పోస్టులు భర్తీ అవుతాయని విద్యా శాఖ అంచనా వేస్తోంది. ముందుగానే 'నాట్ విల్లింగ్' ఇచ్చిన వారిని పక్కన పెట్టి మిగిలిన స్కూల్ అసిస్టెంట్లకు సీనియారిటీ ఆధారంగా జీహెచ్ఎంలుగా పదోన్నతులు ఇవ్వనున్నది.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు కలిపి 2,017 జీహెచ్ంఎం పోస్టులు ఉన్నాయి. పదోన్నతులు కల్పిస్తే 30 శాతం మంది ఆయా పోస్టుల్లో జాయిన్ కాకపోవచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేశాయి. అందుకే 'నాట్ విల్లింగ్' ఆప్షన్ తీసుకొని రావాలని ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై బుధవారం పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ,పాఠశాల విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ కే.లింగయ్య, జాయింట్ డైరెక్టర్ పి. మదన్‌మోహన్ సమావేశం అయ్యారు. ఉపాధ్యాయ సంఘాలు కోరినట్లే 'నాట్ విల్లింగ్' ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

జీహెచ్ఎం ప్రమోషన్ తీసుకునేందుకు ఆసక్తి లేని ఉపాధ్యాయులు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రమోషన్ వద్దనుకుంటే.. ఆ తర్వాత సీనియారిటీ ఉన్న వారికి అవకాశం కల్పించనున్నారు. చివరి సారిగా 2015లో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. స్కూల్ అసిస్టెంట్లు జీహెచ్ఎంగా పదోన్నతి పొందితే.. వారి స్థానంలో ఏర్పడే ఖాళీలను కూడా బదిలీల్లో చూపించనున్నారు. దీని వల్ల స్కూల్ అసిస్టెంట్లు ఆయా ఖాళీల కోసం బదిలీ ఆప్షన్ పెట్టుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీల తర్వాత ఎస్జీటీలకు ప్రమోషన్ ఇచ్చి బదిలీ చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News