ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా
కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్
అమృత్ టెండర్లపై కేటీఆర్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం సెక్రటేరియట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమృత్ స్కీంలో భాగంగా రూ.3,516 కోట్ల టెండర్లు మాత్రమే పిలిస్తే కేటీఆర్ రూ.8,888 కోట్లుగా పన్చి అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. తాను చెప్తోన్న మాటలను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని.. ఆదివారం ఎక్కడికి రావాలో, ఎప్పుడు రావాలో కేటీఆర్ చెప్పాలన్నారు. కేటీఆర్ చెప్పేది అబద్ధమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందే కాంట్రాక్టర్ నని.. తాను ఎవరికి భయపడబోనని అన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడేప్పుడు ఆధారాలు చూసుకోవాలని, తప్పులుంటే ప్రశ్నించాలని అన్నారు. మిషన్ భగీరథ పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.34 వేల కోట్లు కొల్లగొట్టిందని.. దానికి మూల్యం చెల్లించుకోవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు. అమృత్ స్కీం నిధులతో చేపట్టే పనులకు ఓపెన్ టెండర్లు పిలిచామని, క్వాలిఫై అయిన కంపెనీలకు టెండర్ కట్టబెట్టామని.. అందులో దాపరికం ఏమిలేదన్నారు. సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బావమరిది కాదని.. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి అల్లుడని తెలిపారు. ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్ లో చేరినందుకు సృజన్ కు కాంట్రాక్ట్ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ ప్రభుత్వం, సీఎంపై బట్టకాల్చి మీద వేస్తున్నాడని ఇంత మంచిది కాదన్నారు.