హైదరాబాద్ లో ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే భారీ ఫైన్లు
నిబంధనలు కఠినతరం చేసిన ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేసే వాహనదారులకు షాకింగ్ న్యూస్ ఇది. ఇకపై నగరంలో టూవీలర్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు తేల్చిచెప్పారు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేసే వారికి విధించే ఫైన్ ను రూ.200లకు పెంచారు. రాంగ్ సైడ్, రాంగ్ రూట్లలో వాహనాలు నడిపితే ఇకపై రూ.2 వేల ఫైన్ వేస్తారు. నగరంలో పెరిగిన యాక్సిడెంట్లను నివారించేందుకు పబ్ ల ఎదురుగానే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్ట్రిక్ట్ గా ట్రాఫిక్ రూల్స్ అమలు చేసే దిశగా పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారి నుంచి పెండింగ్ చాలన్లు వసూలు చేశారు. ప్రమాదాల్లో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వాళ్లే ఎక్కువగా చనిపోతున్నారని, ఈ నేపథ్యంలోనే హెల్మెట్ తప్పనిసరి చేశామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు.