నా దారి నేను చూసుకుంటా.. బీజేపీకి బాపురావు వార్నింగ్

తనకు టికెట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారన్నారు సోయం బాపురావు. ఆదివాసీ నేతకు టికెట్ రాకుండా పావులు కదిపారన్నారు. తాను ఎక్కడ గెలుస్తానో అనే భయం వాళ్లకుందన్నారు.

Advertisement
Update:2024-03-03 12:45 IST

ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు మొదటి లిస్టులో రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారంటూ బాపురావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన బలం, బలగం కావాలనుకుంటే పార్టీ తనకు టికెట్ ఇస్తుందన్నారు.

బీజేపీ హైకమాండ్‌ 195 మంది అభ్యర్థులతో మొదటి లిస్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ నుంచి 9 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసింది కమలదళం. అయితే నాలుగు సిట్టింగ్ స్థానాల్లో మూడు స్థానాల్లో మళ్లీ పాతవారికే అవకాశమిచ్చింది. కానీ ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో ఉంచింది. దీంతో అసంతృప్తికి గురైన ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

తనకు టికెట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారన్నారు సోయం బాపురావు. ఆదివాసీ నేతకు టికెట్ రాకుండా పావులు కదిపారన్నారు. తాను ఎక్కడ గెలుస్తానో అనే భయం వాళ్లకుందన్నారు. తాను కొమ్మపై ఆధారపడే పక్షిని కాదని.. రెక్కల మీద ఆధారపడ్డ పక్షినని.. స్వతహాగా ఎదగగలనన్నారు. టికెట్ రాకపోతే తన దారి తాను చూసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన సోయం బాపురావు.. అనూహ్యంగా విజయం సాధించారు. అయితే ఆయనపై కొద్దికాలంగా విమర్శలు ఉండడంతో ఈ సారి టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News