నేనే హోంమంత్రి.. రేవంత్‌కు ఎసరు పెట్టిన రాజగోపాల్!
కేసీఆర్‌ను గద్దె దించడానికే నేను కాంగ్రెస్‌లోకి వచ్చా. అధిష్టానం నాకు హామీ ఇచ్చింది. అందుకే హోం మంత్రి ఇవ్వాలని కోరుతున్నా" అన్నారు రాజగోపాల్‌రెడ్డి.
అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "నాకు హోం మంత్రి కావాలని ఉంది. BRS వాళ్లను జైలుకు పంపాలనేది నా కోరిక. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి సహా అందర్నీ జైలుకు పంపుతా. నేను హోంమంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్‌లో ఉంటారు. కేసీఆర్‌ను గద్దె దించడానికే నేను కాంగ్రెస్‌లోకి వచ్చా. అధిష్టానం నాకు హామీ ఇచ్చింది. అందుకే హోం మంత్రి ఇవ్వాలని కోరుతున్నా" అన్నారు రాజగోపాల్‌రెడ్డి.
త్వరలోనే BRSను బీజేపీలో విలీనం చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్‌రెడ్డి. కేసీఆరే దగ్గరుండి BRS ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపుతారని జోష్యం చెప్పారు. కేసీఆర్‌కు బీజేపీనే శ్రీరామరక్ష అన్నారు. వాళ్లను వాళ్లు కాపాడుకోవడానికి BRS ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారన్నారు రాజగోపాల్‌రెడ్డి. భువనగిరి, నల్గొండ పార్లమెంట్‌కు కుటుంబ సభ్యులెవ్వరూ పోటీ చేయకూడదు అనేది తమ ఉద్దేశం అన్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తం లేదంటే లేదు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామన్నారు రాజగోపాల్‌రెడ్డి.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. కీలకమైన శాఖ కావడంతో రేవంత్ రెడ్డి తనతోనే అట్టిపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి ఏకంగా హోంశాఖకే ఎసరు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా?. ఆయన కోరుకున్నట్లుగానే హోంశాఖను కేటాయిస్తారా?. అందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.