ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తే ఆరు కేసుల్లో ఇరికించాలని చూస్తున్నరు

మేడిగడ్డకు పర్రె పడలే.. రేవంత్‌ పుర్రెకు పడ్డది : కేటీఆర్‌

Advertisement
Update:2025-01-04 20:06 IST

ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తే తనను ఆరు కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రేవంత్‌ రెడ్డి కేసుల గురించి ఆలోచిస్తుంటే తాము రైతుల గురించి ఆలోచిస్తున్నామన్నారు. శనివారం సిరిసిల్ల తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం అంటే ఇప్పుడు కట్టింగ్‌ మాస్టర్‌ అని.. అన్ని పథకాలకు కోత పెట్టేవారు అని ప్రజలు మాట్లాడుతున్నారని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగబాటుకు కాంగ్రెస్‌ పార్టీనే దొంగచాటుగా ఏదో చేసిందని సందేహం వ్యక్తం చేశారు. మేడిగడ్డకు పర్రె పడలేదని.. రేవంత్‌ రెడ్డి పుర్రెకే పడిందని అన్నారు. ఈ ఏడాది స్థానిక సంస్థలు ఉంటాయని.. పార్టీ కార్యకర్తలు, నాయకులు కేసులకు భయపడకుండా కార్యక్షేత్రంలోకి దిగాలన్నారు. చిట్టినాయుడు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ఏమీ పీకలేడన్నారు. చిల్లరమల్లర రాతలు రాయించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బాక్సింగ్‌ రింగ్‌ లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు అన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎనిమిది మంది, బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచినా వాళ్లు రాష్ట్రానికి తెచ్చింది మాత్రం గుండు సున్నానే అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న చిన్న తప్పిదాలతోనే ఓడిపోయామన్నారు. కేసీఆర్ ఒక రోజు దేశంలో చక్రం తిప్పే రోజు ముందుందన్నారు. తెలంగాణ ఏర్పడే రోజు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పజెప్తే బీఆర్‌ఎస్‌ దిగిపోయే రూ.5,564 కోట్ల మిగులతో కాంగ్రెస్‌ కు రాష్ట్రాన్ని అప్పగించామన్నారు. రెవెన్యూ మిగులుపై ఈ ప్రభుత్వంలోనే ఏకాభిప్రాయం లేదని.. ముఖ్యమంత్రి ఒకటే చెప్తుంటే డిప్యూటీ సీఎం ఇంకో మాట అంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రూ. 4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ ఒక్క ఏడాదిలో రూ. 1.37 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులతో జరిగిన అభివృద్ధి గురించి తాము చెప్తామని, కాంగ్రెస్‌ తెచ్చిన అప్పులతో ఏం జరిగిందో చెప్పగలరా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల పొట్ట కొట్టడం తప్ప ఏమీ చేయలేదన్నారు. అప్పులు తెచ్చిన సొమ్ముతో ఢిల్లీ హైకమాండ్‌ కు మూటలు పంపుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం అయిపోయిందన్నారు. ప్రజాపాలన పేరుతో 1.06 కోట్ల మంది ప్రజల నుంచి తీసుకున్న అప్లికేషన్లను ఏం చేశారని.. ఇప్పుడు మళ్లీ రైతు భరోసాకు అప్లికేషన్లు ఎందుకని ప్రశ్నించారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని, బూత్‌ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీల వరకు వేసుకొని పార్టీని బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. రైతుభరోసా సాయం, రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, రైతుబంధు పేరుతో కేసీఆర్‌ డబ్బులు వృథా చేశారనే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రచారంపై గ్రామాల్లో చర్చ పెట్టాలని నాయకులను కోరారు.

Tags:    
Advertisement

Similar News