జగిత్యాల బంద్‌తో నాకేం సంబంధం లేదు.. అది కొన్ని పార్టీల కుట్ర : ఎస్సై అనిల్

తనపై వచ్చిన ఆరోపణలను కొన్ని పార్టీలు స్వార్థపూరితంగా వాడుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వాళ్లు నిర్వహించ తలపెట్టిన బంద్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని సస్పెండ్ అయిన ఎస్ఐ అనిల్ చెప్పారు.

Advertisement
Update:2023-05-13 07:14 IST

ఒక ఆర్టీసీ బస్సులో తన భార్యకు, వేరే మహిళకు మధ్య జరిగిన గొడవలో తలదూర్చి.. సదరు మహిళను నానా దుర్భాషలాడిన జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్‌‌పై పోలీస్ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ అనిల్‌కు అన్యాయం జరిగిందని, పోలీస్ శాఖ ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని నిరసిస్తూ బీజేపీ సహా కొన్ని సంఘాలు శనివారం జగిత్యాల బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనిపై తాజాగా ఎస్ఐ అనిల్ ఒక వీడియోను విడుదల చేశారు.

తనపై వచ్చిన ఆరోపణలను కొన్ని పార్టీలు స్వార్థపూరితంగా వాడుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వాళ్లు నిర్వహించ తలపెట్టిన బంద్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని సస్పెండ్ అయిన ఎస్ఐ అనిల్ చెప్పారు. ఎవరో ఒక పార్టీ తలపెట్టిన బంద్‌తో తనకేం సంబంధం అని అనిల్ ఆవేదన చెందారు. గత కొన్నేళ్లుగా జగిత్యాల జిల్లాలో పని చేస్తున్నాను. ఎలాంటి కల్మషాలు లేకుండా శాంతి భద్రత పరిరక్షణకు నిబద్ధతతో వ్యవహరించానని అనిల్ సదరు వీడియోలో పేర్కొన్నారు.

ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలను పోలీసుల నిబంధనల ప్రకారం పరిష్కరించుకుంటానని, దీనిలో ఎవరూ కల్పించుకోవాల్సిన అవసరం లేదని హితవు పలికారు. తనకు పోలీస్ శాఖపై, ఉన్నతాధికారులపై నమ్మకం ఉందని అనిల్ పేర్కొన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు, ఒక వర్గానికి చెందిన ప్రజలు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అనిల్ తేల్చి చెప్పారు.

తన పేరిట శనివారం జగిత్యాల బంద్ చేస్తున్నట్లు తెలిసింది.. ఆ బంద్‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. బంద్ పాటించి సామాన్య ప్రజలకు ఎలాంటి విజ్ఞప్తి కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదంతా కొన్ని రాజకీయ పార్టీల కుట్రగా సస్పెండ్ అయిన ఎస్ఐ అనిల్ పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News