వైఎస్ షర్మిల ఎవరో నాకు తెలియదు.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఎవరో తనకు తెలియదని.. ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదో కూడా తెలియదని చెప్పుకొచ్చారు.

Advertisement
Update:2023-11-03 18:27 IST

తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ మద్దతు పూర్తిగా కాంగ్రెస్‌కే ఎంటుందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దనే ఉద్దేశంతోనే తాము పోటీ నుంచి తప్పుకుంటున్నామని, భేషరతు మద్దతు కాంగ్రెస్‌కే అని షర్మిల స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

షర్మిల ఎవరో తనకు తెలియదని.. ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయితే పెద్ద తోపా.. ఎవరేమిటనేది ప్రజలు నిర్ణయిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని కూటములు కట్టినా.. తెలంగాణలో ఎవరు మద్దతు లేకుండానే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

తెలంగాణలో శాంతి సామరస్యాలు ఉండాలంటే అది కేవలం బీఆర్ఎస్ వల్లే సాధ్యమని చెప్పారు. ఎంఐఎం పోటీ చేసే తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్‌తో ఫ్రెండ్లీ పోటీ అయినా.. జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్, రాజేంద్రనగర్‌లో ప్రకాశ్ గౌడ్‌ను ఓడిస్తామని అసదుద్దీన్ చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఎందుకు పోటీ చేయడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు కలలు కంటున్నారని.. సీఎం నువ్వా నేనా అని కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. బీసీ అయిన బండి సంజయ్‌నే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే ఎలా నమ్మాలని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News