చౌటుప్పల్ లో నేను ఊహించిన ఓట్లు రాలేదు... ఓటర్ దేవుళ్ళు ఏం చేస్తారో చూద్దాం ..రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాము ఊహించిన ఫలితాలు రాలేదని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాలు పోటాపోటీగా ఉన్నాయి, ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా ఉందని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంటగా కొనసాగుతోంది. ఫలితాల్లో కాంగ్రెస్ ప్రతి రౌండ్ లోనూ మూడవ స్థానంలోనే ఉండటంతో ఫలితాలు ముందే ఊహించిన ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ రూం లోంచి వెళ్ళి పోయారు. కాంగ్రెస్ కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఒకరొకరుగా వెళ్ళిపోతున్నారు. ఇక టీఆరెస్, బీజేపీ ల మధ్య యుద్దం పోటాపోటీ సాగుతోంది. రౌండు రౌండుకూ ఆధిక్యాలు మారిపోతుండటం ఆయా పార్టీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటింగ్ రూం బైటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాము ఊహించిన ఫలితాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాలు పోటాపోటీగా ఉన్నాయి, ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా ఉందని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. మాట్లాడుతున్నంత సేపు ఆయన మొహంలో స్పష్టంగా టెన్షన్ కనపడింది.
వాస్తవానికి చౌటుప్పల్ మండలం బీజేపీకే కాకుండా కోమటిరెడ్డి ఫ్యామిలీకి మంచి పట్టున్న మండలం. ఇలాంటి మండలంలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించడం రాజగోపాల్ రెడ్డిని విస్మయానికి గురి చేసిందన్న భావన వ్యక్తమవుతోంది.