నేను అరపైసా అవినీతి చేయలేదు
తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచడానికే కృషి చేశా : కేటీఆర్
ఫార్ములా - ఈ కేసులో ఎఫ్‌ఈవోకు చెల్లింపుల వ్యవహారంలో తాను అరపైసా అవినీతి చేయలేదని కేటీఆర్ తెలిపారు. గురువారం ఉదయం నంది నగర్ లోని తన నివాసం నుంచి ఏసీబీ విచారణకు బయల్దేరుతున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఏ పని చేసినా అది తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసమే చేశానని తెలిపారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు బామ్మర్థికి రూ.1,137 కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టలేదని, తన కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదని, ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొనలేదని చెప్పారు. తాను రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొనడానికి పోయి దొరికిన దొంగను కూడా కాదన్నారు. తాను నిఖార్సయిన తెలంగాణ బిడ్డనని.. అరపైసా అవినీతి చేయలేదని తేల్చిచెప్పారు.
ఈవీ రంగంలో హైదరాబాద్ ను డిస్టినేషన్ చేయాలని కష్టపడ్డ : కేటీఆర్
ఎలక్ట్రిక్ వెహికిల్ సెక్టార్ లో హైదరాబాద్ ను డెస్టినేషన్ గా చేయాలనే తాను కష్టపడ్డానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గురువారం ఉదయం ఈమేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్ మరియు తయారీ రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఫార్ములా ఈ రేసు తీసుకువచ్చామన్నారు. ఫార్ములా ఈ సందర్భంగా నిర్వహించిన ఈ- మొబిలిటీ వీక్ ద్వారా రూ.12 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామన్నారు. నీచమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఈ అంశం అర్థం కాలేదని ధ్వజమెత్తారు. కానీ విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసన్నారు. తమ ప్రభుత్వ విజన్, నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని.. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుందని పేర్కొన్నారు.