జాహ్నవి విషయంలో అమెరికా పోలీసుల తీరు నన్ను కలవరపెట్టింది : మంత్రి కేటీఆర్

జాహ్నవి మృతిపై స్వంత్రత్ర దర్యాప్తును జరపించేలా అమెరికాను కోరాలని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌‌ను ఎక్స్(ట్విట్టర్)లో మంత్రి కేటీఆర్ రిక్వెస్ట్ చేశారు.

Advertisement
Update:2023-09-14 10:08 IST

ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అనే యువతి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతిని ఒక పోలీసు అధికారి ఎగతాళి చేయడంపై అమెరికాలో దుమారం రేగింది. జాహ్నవి మృతిపై పోలీసులు స్పందించిన తీరుపై ప్రవాస భారతీయులు, నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో సదరు పోలీసు అధికారి, సహ ఉద్యోగిపై సియాటెల్ పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది. కాగా అమెరికా పోలీసుల తీరుపై తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.

జాహ్నవి మృతి పట్ల సియాటెల్ పోలీస్ ఆఫీసర్ చేసిన కామెంట్లు దారుణంగా ఉన్నాయని అన్నారు. అమెరికా పోలీసులు వ్యవహరించిన తీరు తనను కలవరపెట్టిందని.. ఈ ఘటన తనను కలచివేసిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే అమెరికా ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకొని వెళ్లి, జాహ్నవి కుటుంబానికి న్యాయం చేయాలని ఇండియాలోని అమెరికన్ ఎంబసీని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

జాహ్నవి మృతిపై స్వంత్రత్ర దర్యాప్తును జరపించేలా అమెరికాను కోరాలని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌‌ను ఎక్స్(ట్విట్టర్)లో మంత్రి కేటీఆర్ రిక్వెస్ట్ చేశారు. ఎన్నో కలలతో, ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లిన యువతి ఇలా అర్దాంతరంగా చనిపోవడం, ఆమె మరణాన్ని కూడా అక్కడి పోలీసులు చులకన చేయడం చాలా బాధకరం అని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతుండగా ఒక పోలీస్ వాహనం వచ్చి జాహ్నవిని ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ ఘటనపై సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆడెరెర్ కారు నడుపుతూ చేసిన సంభాషణ ఒకటి బయటకు వచ్చింది. జాహ్నవి ప్రాణం విలువ చాలా తక్కువని.. అసలు ఆమె ప్రాణానికి విలువే లేదని వ్యాఖ్యానించాడు. ఆమెకు 26 ఏళ్లు.. 11 వేల డాలర్లకు చెక్ రాస్తే చాలు అంటూ అడెరర్ చులకనగా మాట్లాడారు. దీనిపైనే అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి. 


Tags:    
Advertisement

Similar News