బిల్డర్లను, పెద్ద వ్యాపారవేత్తలను బెదిరించడానికే హైడ్రా

మూసీ పేరుతో జరుగుతున్న లూటీని తాము ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్న కేటీఆర్‌

Advertisement
Update:2024-10-16 13:17 IST

ప్రభుత్వ అనాలోచిత విధానాలు, నిర్ణయాల వల్లనే హైదరాబాద్‌లోని పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. హైడ్రా, మూసీ విషయంపై జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్ లో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ప్రభుత్వ చర్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ప్రజల ఇబ్బందులపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా బీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుందన్నారు.

రేవంత్‌ ప్రభుత్వం ప్రణాళిక, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా కేవలం గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు... పేదలకు ఎవరూ అండగా లేరు. ఏం చేస్తారు అన్నట్టు ఇష్టారీతిన వెళ్తున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో హైడ్రా మాకు అర్థమైంది ఏమిటంటే కేవలం బిల్డర్లను, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను బెదిరించడానికి, బ్లాక్‌మెయిల్‌ చేయడానికి, వసూళ్లు చేయడానికే వాడుతున్నట్టు ఆరోపించారు. మూసీ నది గురించి రోజుకో మాట చెబుతున్నారు. మూసీ నదిపై డీపీఆర్‌ పూర్తి కాలేదంటున్నారు. మూసీ నది విషయంలో అనాలోచితంగా ముందుకెళ్తున్నారని కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు.మురుగునీటి శుద్ది కేంద్రాలను తామే వంద శాతం పూర్తి చేశామన్నారు. కూకట్‌పల్లిలో 1980లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే 20 వేల మందికి పట్టాలు ఇచ్చింది. వాళ్లు ఇచ్చిన ఇళ్లనే ఇప్పడు రేవంత్‌ సర్కార్‌ ఆక్రమణలని అంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఉంటున్న వారి ఇళ్లు కూలగొడుతామంటున్నారు. వసూళ్ల కోసమే హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారని ధ్వజమెత్తారు.మూసీ పేరుతో జరుగుతున్న లూటీని తాము ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎవరూ వచ్చినా రాకపోయినా బీఆర్‌ఎస్‌ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు రక్షణ కవచంగా ఉంటుంది అన్నారు. రేవంత్‌రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డంగా తాము ఉంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోని ఎస్టీపీలు, ఎస్‌ఎన్‌డీపీ పనులను సందర్శిస్తామన్నారు. బస్తీల్లోకి వెళ్లి భరోసా కల్పిస్తామని, లీగల్‌ సెల్‌ ద్వారా అండగా ఉంటామన్నారు. ఇప్పటికే 440 కుటుంబాల తరఫున కోర్టులో పోరాడుతున్నామన్నారు. హైడ్రా వసూళ్లతోనే నాంపల్లిలో కాంగ్రెస్‌, మజ్లిస్‌ నేతల గొడవ అని ఆరోపించారు.రాడార్‌ స్టేషన్‌తో స్థానికులకు ఒక్క ఉద్యోగం రాదన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే ప్రాజెక్టుకు ఎలా అనుమతిస్తారు? మూసీ సుందరీకరణకు రూ లక్షా 50 వేల కోట్లు ఎలా తెస్తారు?అని కేటీఆర్‌ ప్రశ్నించారు.



Tags:    
Advertisement

Similar News