సీఎం రేవంత్‌ సోదరులకు హైడ్రా షాక్‌

వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసుల్లో ఇచ్చిన గడువులోగా అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని లేదంటే స్వయంగా తామే కూల్చివేతలు చేపడతామని నోటీసుల్లో పేర్కొన్నారు.

Advertisement
Update:2024-08-29 10:00 IST

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఐతే హైడ్రా పనితీరుపై విమర్శలు కూడా ఉన్నాయి. కేవలం రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికే హైడ్రాను ఉపయోగిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది. దుర్గం చెరువు FTL పరిధిలో నిర్మించిన భవనాలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుల నివాసాలతో పాటు పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌, సినీ, రాజకీయ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. 30 రోజుల్లోగా ఆయా నిర్మాణాలను తొలగించాలంటూ నోటీసులు జారీ చేశారు అధికారులు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్‌, అమర్ సొసైటీ వాసులకు కూడా ఇదే తరహాలో నోటీసులు జారీ చేశారు. వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసుల్లో ఇచ్చిన గడువులోగా అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని లేదంటే స్వయంగా తామే కూల్చివేతలు చేపడతామని నోటీసుల్లో పేర్కొన్నారు. బుధవారం ఒక్కరోజే వందలాది ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు నోటీసులు జారీ చేయడంతో ఆయా ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది.

దుర్గం చెరువును సీక్రెట్‌ లేక్‌గా పిలిచేవారు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో రాయదుర్గం, మాదాపూర్‌ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు విస్తరించింది. ఈ చెరువు చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు వెలిశాయి. వాస్తవానికి దుర్గం చెరువు పూర్తి విస్తీర్ణం వంద ఎకరాలు కాగా.. ఇటీవలి కొలతల ప్రకారం 84 ఎకరాలకు కుచించుకుపోయింది. దశాబ్ధం క్రితం ఈ ఏరియాను నాన్‌ డెవలప్‌మెంట్ జోన్‌గా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఐనప్పటికీ అనేక కట్టడాలు వెలిశాయి. ఆక్రమించిన స్థలాల్లో లాయర్లు, రాజకీయ నేతలు, ఇంజినీర్లు, రిటైర్డ్‌ బ్యూరోక్రాట్స్‌ బిల్డింగ్స్ కట్టుకున్నారు.

Tags:    
Advertisement

Similar News