హైడ్రా నెక్స్ట్ టార్గెట్ అదే..!

సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలన్నిటికీ హైడ్రా స్పందిస్తుందని అనుకోలేం. కానీ ఈ వ్యవహారంపై అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Advertisement
Update:2024-08-26 20:15 IST

జూన్ 27నుంచి తెలంగాణలో హైడ్రా సంస్థ ఆక్రమణల తొలగింపు చేపట్టింది ఇప్పటి వరకు 43ఎకరాల 94 గుంటల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అక్కడ ఉన్న నిర్మాణాలు తొలగించారు. అయితే ఈ ఆపరేషన్ లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు అంతకు మించి మరో సంచలన భవనంపై హైడ్రా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. అక్కడ యాక్షన్ మొదలు పెడితే, రియాక్షన్ ఎలా ఉంటుందోననే అనుమానం అందరిలో నెలకొంది.

బండ్లగూడ మండలం సలకం చెరువును ఆక్రమించి ఒవైసీ సోదరులు ఫాతిమా కాలేజీ నిర్మించారనే ఆరోపణలున్నాయి. హైడ్రా సంస్థకు, సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఆక్రమణలపై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులందాయి. గూగుల్ మ్యాప్స్ లో ఆక్రమణలు స్పష్టంగా తెలుస్తున్నాయని కూడా చెబుతున్నారు. సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఫాతిమా విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టింగ్ లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలన్నిటికీ హైడ్రా స్పందిస్తుందని అనుకోలేం. కానీ ఈ వ్యవహారంపై అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఫాతిమా విద్యాసంస్థలేననే అనుమానాన్ని బలపరుస్తున్నాయి.

పేదలకు ఉచిత విద్య అందించేందుకు ఇప్పటివరకు 12 బిల్డింగ్ లు నిర్మించానని చెబుతున్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. సేవా దృక్పథంతో తాము విద్యా సంస్థలు స్థాపించి పేదలకు ఉచితంగా విద్యను అందిస్తుంటే.. కొందరు కుట్రపూరితంగా తమపై బురదజల్లుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో తనపై దాడి జరిగిందని, మరోసారి బుల్లెట్ల వర్షం కురిపించినా ఎదుర్కోడానికి తాను సిద్ధమేనన్నారు అక్బరుద్దీన్. తనను బలహీనుడని అనుకోవద్దని, పేదల విద్యాభివృద్ధికి తాను చేస్తున్న కృషిని అడ్డుకోవద్దని ఆయన పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఫాతిమా కాలేజీలే అనే అనుమానం బలపడుతోంది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్వహిస్తున్న లేక్‌ ప్రోటెక్షన్‌ వెబ్‌సైట్‌లో సలకం చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్ వివరాలున్నాయి. అందులో ఉన్న మ్యాప్ ప్రకారం చెరువు పరిధిలోనే ఫాతిమా విద్యాసంస్థలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అధికారిక మ్యాప్ లను కొంతమంది సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే, సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే.. ఎంఐఎం నేతల ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News