హైడ్రా మరో సంచలనం.. అధికారులపై క్రిమినల్ కేసులు
ఇప్పటి వరకు 10మంది ఆక్రమణదారులు, నిర్మాణసంస్థలపై కేసులు నమోదు చేయించిన హైడ్రా, ఇప్పుడు అవినీతి అధికారుల లిస్ట్ ని సైబరాబాద్ కమిషనరేట్ కి అందించింది.
హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కూల్చివేతలతోనే వార్తల్లోకెక్కిన హైడ్రా, ఇప్పుడు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటోంది. అక్రమ కట్టడాలే కాదు, ఆ కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారుల భరతం కూడా పడతామంటున్నారు. దీంతో హైదరాబాద్ లోని వివిధ జోన్లలో పనిచేసిన కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, ఇతర సిబ్బందిలో టెన్షన్ మొదలైంది. తొలి దఫా ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేసింది.
ఇప్పటి వరకు 10మంది ఆక్రమణదారులు, నిర్మాణసంస్థలపై కేసులు నమోదు చేయించిన హైడ్రా, ఇప్పుడు అవినీతి అధికారుల లిస్ట్ ని సైబరాబాద్ కమిషనరేట్ కి అందించింది. బాచుపల్లి తహశీల్దార్ గా పనిచేసిన పూల్ సింగ్ చౌహాన్, నిజాంపేట నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేసిన రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన సుధాంశు సహా మొత్తం ఆరుగురిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరితోపాటు మరో అధికారిపై క్రమశిక్షణ చర్యలకోసం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. హైడ్రా ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ కమిషనరేట్ విచారణ కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది.
శిఖం భూమిని పట్టాభూమిగా చూపుతూ తప్పుడు నివేదికలు ఇవ్వడం, లే అవుట్ లకు అక్రమంగా అనుమతులు మంజూరు చేయడం, చెరువు స్థలాన్ని ప్రైవేట్ భూమిగా పేర్కొంటూ నివేదికలు ఇవ్వడం వంటి ఆరోపణలు ఆయా అధికారులపై ఉన్నాయి. మరోవైపు గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నిర్మాణాలు చేపడుతున్నా కొంతమంది సీనియర్ ఇంజినీర్లు పట్టించుకోలేదని వారిపై కూడా విచారణ చేపట్టామని తెలిపారు. ఈ లిస్ట్ లో మరికొన్ని పేర్లు కూడా ఉండే అవకాశముంది.
హైదరాబాద్ లో హైడ్రా ఓ సంచలనంగా మారింది. రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రాగానే, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి భవనానికి నోటీసులిచ్చారు. ఎంఐఎం నేతలనుంచి వార్నింగ్ రాగానే.. కాలేజీల కూల్చివేతకు అకడమిక్ ఇయర్ అడ్డొస్తుందనే సమాధానం వచ్చింది. తాజాగా అధికారులపై క్రిమినల్ కేసుల పేరుతో హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.