2023లో ఇళ్ల ధరలు భారీగా పెరుగుతాయా..?

ఈ ఏడాది ఇళ్ల ధరలు పెరుగుతాయని 58 శాతం మంది డెవలపర్లు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. మరో 32 శాతం మంది మాత్రం ఇళ్ల ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, అవి స్థిరంగా ఉంటాయని తెలిపారు.

Advertisement
Update:2023-01-16 18:51 IST

నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో గత నాలుగైదేళ్లలోనే ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆమాటకొస్తే నిర్మాణ వ్యయాల వల్ల అద్దెలు కూడా పెరిగాయి. మరి 2023 ఎలా ఉండబోతోంది..? ఈ ఏడాది నిర్మాణ ఖర్చులు ఎలా ఉంటాయి..? వాటి మీద ఆధారపడిన ఇళ్ల ధరలు ఎలా ఉంటాయి..? దీనిపై రియల్ ఎస్టేట్ డెవలపర్ల సెంటిమెంట్ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

పెరిగే అవకాశాలే ఎక్కువ..

ఈ ఏడాది ఇళ్ల ధరలు పెరుగుతాయని 58 శాతం మంది డెవలపర్లు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. మరో 32 శాతం మంది మాత్రం ఇళ్ల ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, అవి స్థిరంగా ఉంటాయని తెలిపారు. రియల్టర్ల అపెక్స్ బాడీ క్రెడాయ్‌.. కొన్ని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థలతో కలసి ఈ సర్వే చేపట్టింది. 2022 మధ్య నుంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వ్యయాలు 10నుంచి 20 శాతం వరకు పెరిగినట్లు సర్వే తెలిపింది. ఈ ఏడాది కూడా ఈ పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది.

గిరాకీ ఉంటుందా..?

ఇక ఇళ్ల రేట్లపైనే గిరాకీ ఆధారపడి ఉంటుంది. నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగిన కొన్నిరోజుల వరకు గిరాకీ స్తబ్దుగా ఉంటుంది. ఆ తర్వాత తిరిగి ఊపందుకుంటుంది. 2022లో ఇళ్లకు గిరాకీ భారీగా పెరిగింది. హైదరాబాద్ వంటి నగరాల్లో ఇళ్లు అత్యథికంగా అమ్ముడయ్యాయి. ఆఫీస్ స్పేస్ అద్దెకు ఇచ్చే విషయంలో కూడా కొత్త రికార్డులు నమోదయ్యాయి. 2023లో ఇళ్లకు గిరాకీ స్థిరంగా ఉంటుందని 43 శాతం మంది డెవలపర్లు తమ అభిప్రాయం వెలిబుచ్చారు. మరో 31 శాతం మంది మాత్రం డిమాండ్‌ 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. రెండునెలలపాటు నిర్వహించిన ఈ సర్వేలో 341 మంది స్థిరాస్తి డెవలపర్లు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు.

ఇళ్ల ధరలు పెరగడం ఖాయమని తేలిపోయింది. అయితే అది ఎంతమేర ఉంటుందనేది మాత్రం చెప్పలేమంటున్నారు డెవలపర్లు. ఇంటి ధరలు పెరగడానికి నిర్మాణంలో వినియోగించే వస్తువుల ధరల పెరుగుదలతోపాటు, ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం దోహద పడతాయి. వడ్డీరేట్ల పెరుగుతలతో ఈఎంఐలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి కాబట్టి.. అది కూడా ఇళ్ల ధరల పెరుగుదలకు కారణం అవుతుంది. ప్రస్తుతం వడ్డీరేట్లు పెరుగుతున్నా.. ఇళ్లు కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తిగా ముందుకు వస్తున్నారని చెబుతున్నారు. ఆర్దిక మాంద్యం, ఉద్యోగాల కోత వంటివి ఇళ్ల గిరాకీపై ప్రభావం చూపబోవని అంచనా వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News