ఈనెల 15 నుంచి హైదరాబాద్‌లో జీ-20 వ్వవసాయ మంత్రుల సదస్సు.. - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
46 రంగాలకు సంబంధించి 56 నగరాల్లో జీ-20 ఈ సమావేశాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 140కి మించి సమావేశాలు పూర్తయినట్లు తెలిపారు. జీ-20 దేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, 70 శాతం వర్తకం జీ-20 దేశాల నుంచే జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు జీ-20 వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సు జరుగనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్టు చెప్పారు. జీ-20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, వ్యవసాయ శాఖ మంత్రులు ఈ సదస్సులో పాల్గొననున్నట్టు తెలిపారు.
ఈ సదస్సులు చాలా కీలకమైనవని, ప్రపంచానికి సంబంధించి పలు అంశాలపై దిశానిర్దేశం చేసే సమావేశాలన్నారు. భారత ప్రభుత్వం జీ-20 దేశాల సదస్సుకు ఆతిథ్యం ఇస్తుందని, దేశంలో, ప్రపంచంలోని ప్రజలు ఈ సమావేశాలపై ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.
ప్రపంచంలో కరోనా తర్వాత ఏర్పడిన అనేక రకాల సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశాలు వేదికయ్యాయన్నారు కిషన్ రెడ్డి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచమంతా ఆ రెండు దేశాలకు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయాయని, అయితే భారత్ మాత్రం తటస్థంగా ఉండి చాలా కీలకంగా వ్యవహరిస్తోందన్నారు.
46 రంగాలకు సంబంధించి 56 నగరాల్లో జీ-20 ఈ సమావేశాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 140కి మించి సమావేశాలు పూర్తయినట్లు తెలిపారు. జీ-20 దేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, 70 శాతం వర్తకం జీ-20 దేశాల నుంచే జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. జీడీపీ 85 శాతం ఈ దేశాల నుంచి ఉంటుందన్నారు. 75 శాతం జనాభా జీ-20 దేశాల్లోనే ఉందని చెప్పారు. మన హైదరాబాద్ కేంద్రంగా కూడా కీలకమైన రంగాలకు సంబంధించిన సమావేశాలు కొన్ని జరిగాయని తెలిపారు. జీ-20 చివరి సమావేశాలు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరుగుతాయని, జీ-20 దేశాలు, ఆతిథ్య దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకానున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారు.