హైదరాబాద్ లో సన్ బర్న్ రద్దు.. విశాఖలో మాత్రం యథాతథం
నిర్వాహకులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు, టికెట్లను ఆన్ లైన్ లో విక్రయిస్తున్న బుక్ మై షో ఏజెన్సీకి కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ సన్ బర్న్ రద్దయింది.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ.. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వినపడుతున్న పేరు 'సన్ బర్న్'. సన్ బర్న్ పేరుతో 2023 డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 తెల్లవారు ఝాము వరకు పార్టీ చేసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. మ్యూజిక్ షో, విందు, మందు.. అన్నీ ఈ కార్యక్రమంలో ఉంటాయి. ఏపీలో విశాఖలో, తెలంగాణలో హైదరాబాద్ లో సన్ బర్న్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే అనూహ్యంగా తెలంగాణలో ఈ కార్యక్రమం రద్దయింది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ వ్యవహారంపై మరింత ఫోకస్ పెట్టారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా.. మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టడంపై అధికారులకు పలు సూచనలు చేయడం, సన్ బర్న్ వ్యవహారంపై ఆయన ఆరా తీయడంతో అసలు కథ మొదలైంది. మాదాపూర్ లో నిర్వహించాలనుకుంటున్న సన్ బర్న్ కార్యక్రమానికి అసలు ఎవరు అనుమతిచ్చారంటూ రేవంత్ రెడ్డి పోలీసుల్ని ప్రశ్నించారు. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు, టికెట్లను ఆన్ లైన్ లో విక్రయిస్తున్న బుక్ మై షో ఏజెన్సీకి కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ సన్ బర్న్ రద్దయింది.
విశాఖలో ఓకే..
ఇటు విశాఖ వేదికగా జరగబోయే సన్‌బర్న్ ఈవెంట్ టికెట్లు మాత్రం అమ్ముడుపోతున్నాయి. విశాఖలో ఈ నైట్ పార్టీకి అనుమతులున్నాయి కాబట్టి ఇక్కడ యథాతథంగా కార్యక్రమం జరుగుతుందని అంటున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో సన్ బర్న్ కార్యక్రమం పేరుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నైట్ పార్టీల్లో పాల్గొంటారు యువత. గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో సన్ బర్న్ ఈవెంట్లు జరిగాయి. ఈ ఏడాది మాత్రం తెలంగాణలో న్యూ ఇయర్ 'సన్ బర్న్' రద్దుకాగా, విశాఖలో ఈ ప్రత్యేక 'మ్యూజికల్ నైట్' కొత్త ఏడాదికి స్వాగతం చెప్పబోతోంది.