గణేష్ మండపాల వద్ద పాడుపనులు.. రంగంలోకి షి-టీమ్ లు
షి-టీమ్స్ అరెస్ట్ చేసిన ఆకతాయిల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. పలువురు ప్రైవేటు ఉద్యోగులతోపాటు, ఆటోడ్రైవర్లు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. వీరంతా క్యూలైన్ లో యువతులను టచ్ చేయడం, కామెంట్స్ చేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు.
భక్తి శ్రద్ధలతో ఇంట్లో గణపతి పూజ నిర్వహించిన వారు, మండపాల వద్దకు వచ్చి కూడా వినాయకుడిని దర్శించుకుంటారు. హైదరాబాద్ లో మండపాల దర్శనం కోలాహలంగా ఉంటుంది. అందులోనూ ఖైరతాబాద్ గణపతిని చూడటం, సెల్ ఫోన్లో ఆయన రూపాన్ని బంధించడం, వాట్సప్ స్టేటస్ పెట్టుకోవడం, సెల్ఫీ దిగడం.. ఇదంతా యువతకు సరదా. ఖైరతాబాద్ తోపాటు.. ఇతర ప్రాంతాల్లో కూడా నవరాత్రుల సందర్భంగా పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. సందడ్లో సడేమియా అంటూ పోకిరీలు కూడా ఈ సందడిలో చెలరేగిపోతుంటారు. అలాంటి పోకిరీల ఆట కట్టించారు షి-టీమ్స్ ప్రతినిధులు. ఏకంగా 55మందిని అరెస్ట్ చేశారు.
క్యూలైన్లో పాడుపనులు..
క్యూలైన్లో వస్తున్న మహిళలను అసభ్యంగా పట్టుకోవడం, గుంపులు గుంపులుగా వెళ్తున్న సందర్భంలో ఉద్దేశపూర్వకంగానే వారి మీద పడిపోవడం, కామెంట్ చేయడం, తాకాలని చూడటం.. ఇలా పోకిరీల ప్రవర్తనపై చాలానే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో షి-టీమ్స్ మండపాల వద్ద నిఘా పెట్టాయి. ఖైరతాబాద్ మహా గణపతి వద్ద మూడు రోజులుగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని గుర్తించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు 55 మంది ఆకతాయిలను అరెస్ట్ చేశారు.
ఆకతాయిలను అరెస్ట్ చేయడంతోపాటు.. పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు పోలీసులు. వీడియో ఫుటేజ్ లో వారి ప్రవర్తన రికార్డ్ కావడంతో ఆధారాలు సేకరణ సులువైంది. షి-టీమ్స్ అరెస్ట్ చేసిన ఆకతాయిల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. పలువురు ప్రైవేటు ఉద్యోగులతోపాటు, ఆటోడ్రైవర్లు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. వీరంతా క్యూలైన్ లో యువతులను టచ్ చేయడం, కామెంట్స్ చేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. ఓ సెల్ ఫోన్ దొంగను కూడా అరెస్ట్ చేశారు. మండపాల వద్ద సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న జార్ఖండ్ వ్యక్తి శ్యామ్ బిహారీని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.