హైదరాబాద్ లో వర్షాలు.. ప్రచారం కోసం అభ్యర్థుల పాట్లు

ఈ నెల 26 వరకు వానలు ఉంటాయనే సమాచారంతో అభ్యర్థులు గుబులుపడుతున్నారు. వర్షాల్లో జనంలోకి వెళ్తే.. కొత్త సమస్యలు ఏకరువు పెట్టే ప్రమాదం ఉంది. అందుకే దాదాపుగా అన్ని పార్టీల అభ్యర్థులు వర్షాలు ఆగిపోవాలని కోరుకుంటున్నారు.

Advertisement
Update:2023-11-23 11:40 IST

ఎన్నికల ప్రచారానికి ఇంకా ఆరు రోజులే టైమ్ ఉంది. చివరి నిమిషంలో అభ్యర్థులు ప్రచారం హోరెత్తించాలని హడావిడి పడుతున్నారు. పార్టీ అధినాయకత్వాన్ని, కీలక నేతల్ని పిలిపించి తమ ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఎన్నికల టైమ్ దగ్గరపడిన తర్వాత ఎంత ఉధృతంగా ప్రచారం చేస్తే అంత ఉపయోగం అనుకుంటున్నారు. అయితే గ్రేటర్ పరిధిలో అభ్యర్థులను జోరు వానలు భయపెడుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈరోజు ప్రచార కార్యక్రమాలు పెట్టుకున్నవారు హడావిడి పడుతున్నారు. జనసమీకరణ సాధ్యమేనా అని ఆందోళన చెందుతున్నారు.

కూకట్‌ పల్లి, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, కర్మన్‌ ఘాట్‌, చంపాపేట్‌, సంతోష్‌ నగర్‌, ఉప్పల్‌, తార్నాక, మెహదీపట్నం, అమీర్‌ పేట, ఎస్సార్ నగర్‌, బేగంపేట, సికింద్రాబాద్‌ లో వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలకు బయలుదేరిన ఉద్యోగులు, విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రచారం అంటే వర్షాలకు జనసమీకరణ కష్టం. రోడ్ షో టైమ్ లో వర్షం పడితే ఏమీ చేయలేని పరిస్థితి.

వర్షాలు ఈ రోజుతో తగ్గేలే లేవు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా మూడు రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. ఈనెల 26 వరకు వానలు ఉంటాయనే సమాచారంతో అభ్యర్థులు గుబులుపడుతున్నారు. వర్షాల్లో జనంలోకి వెళ్తే.. కొత్త సమస్యలు ఏకరువు పెట్టే ప్రమాదం ఉంది. అందుకే దాదాపుగా అన్ని పార్టీల అభ్యర్థులు వర్షాలు ఆగిపోవాలని కోరుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News