50 కోట్ల మంది ప్ర‌యాణికుల రాక‌పోక‌లు.. హైద‌రాబాద్ మెట్రో మ‌రో రికార్డు

హైదరాబాద్లో మెట్రోరైలును 2017 నవంబరు 29న ప్రారంభించారు. తొలి రైలులో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, అప్ప‌టి తెలంగాణ మంత్రి కేటీఆర్ క‌లిసి ప్ర‌యాణించి, లాంఛ‌నంగా ప్రారంభించారు.

Advertisement
Update:2024-05-03 13:08 IST

హైద‌రాబాద్ మెట్రోరైలు మ‌రో ఘ‌న‌త సాధించింది. 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం రోజూ సగటున 5 లక్షల ప్రయాణికులు మెట్రోలో వారి గమ్యస్థానం చేరుతున్నారు. 50 కోట్ల మైలురాయిని చేరుకున్న సంద‌ర్భంగా కస్టమర్ గ్రీన్మెల్‌ లాయల్టీ క్లబ్‌ను శుక్రవారం ఎల్అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రారంభించనుంది.

2017లో ప్రారంభం.. 69.2 కి. మీ. మార్గం

హైదరాబాద్లో మెట్రోరైలును 2017 నవంబరు 29న ప్రారంభించారు. తొలి రైలులో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, అప్ప‌టి తెలంగాణ మంత్రి కేటీఆర్ క‌లిసి ప్ర‌యాణించి, లాంఛ‌నంగా ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం మెట్రోకు అన్ని విధాలా అండ‌దండ‌లు అందించ‌డంతో నెమ్మ‌దిగా మెట్రో ప్ర‌యాణికుల ఆద‌రాభిమానాలు చూర‌గొంది. తొలుత మియాపూర్ నుంచి అమీర్‌పేట మీదుగా నాగోల్ వ‌ర‌కు సేవ‌లు మొద‌ల‌య్యాయి. ఇప్పుడు 5 దశల్లో పూర్తిగా 69.2 కి. మీ. మెట్రో మార్గం అందుబాటులోకి వ‌చ్చింది.

మియాపూర్ - ఎల్బీన‌గ‌ర్ రూట్ టాప్‌

కారిడార్-1లోని మియాపూర్ -ఎల్బీనగర్ మార్గం మెట్రో మార్గాల్లో టాప్ ప్లేస్‌లో ఉంటోంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వ‌చ్చేవారికి, ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల నుంచి న‌గ‌రానికి వ‌చ్చేవారికి ఎల్బీన‌గ‌ర్ ముఖ‌ద్వారం. దీంతో అక్క‌డి నుంచి సిటీలోని ప్ర‌ధాన ప్రాంతాల‌ను క‌లుపుతూ వెళ్లే మియాపూర్ రూట్‌లో విప‌రీత‌మైన ర‌ద్దీ ఉంటోంది. ఈ మార్గంలో నిత్యం రెండున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇదే స్థాయిలో కారిడార్-3 నాగోల్ నుంచి హైటెక్‌సిటీతోపాటు మాదాపూర్, గ‌చ్చిబౌలి వైపు ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు భారీగా ప్ర‌యాణించే నాగోల్‌- అమీర్‌పేట‌- రాయ‌దుర్గం రూట్‌లోనూ భారీగా ప్ర‌యాణికులు మెట్రో వైపు మొగ్గు చూపుతున్నారు.

100 కోట్ల మార్కు ఇంకా ముందుగానే..

2017లో మెట్రో ప్రారంభిస్తే దాదాపు ఆరున్న‌రేళ్ల‌కు 50 కోట్ల ప్ర‌యాణికుల మైలురాయిని మెట్రో అందుకుంది. అయితే ఇటీవ‌ల మెట్రోలో ప్రయాణికులు బాగా పెరిగారు. రోజుకు స‌గ‌టున 5 లక్ష‌ల మంది ప్ర‌యాణిస్తున్నార‌ని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉందని హైద‌రాబాద్ మెట్రో రైల్ అంచ‌నా. ఈ నేప‌థ్యంలో స‌గ‌టున నెల‌కు కోటి మంది ప్ర‌యాణికులు లెక్క‌వేసుకున్నా నాలుగేళ్లు తిర‌గ‌క‌ముందే మెట్రో 100 కోట్ల ప్ర‌యాణికుల మైలురాయిని అందుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News