హైదరాబాద్ మెట్రో.. పర్యావరణానికి ఎంత ఉపయోగమో తెలుసా..?

మెట్రో వల్ల వ్యక్తిగత వాహనాలు, ఇతర వాహనాల వినియోగం తగ్గింది. మెట్రో రాకతో పరోక్షంగా నగరం మొత్తంలో 28 మిలియన్‌ లీటర్ల పెట్రోలు, డీజిల్‌ ఆదా అయింది.

Advertisement
Update:2023-07-18 07:40 IST

మెట్రో ప్రయాణం కేేవలం ప్రజలకు మాత్రమే ఉపయోగకరం కాదు, పర్యావరణానికి కూడా. ఇది కేవలం ప్రచారానికి చెబుతున్న మాటలు అనుకుంటే పొరపాటే.. పర్యావరణానికి మెట్రోవల్ల ఎంత ఉపయోగం జరిగింది, ఏం జరిగింది..? అనేది కూడా గణాంకాల ద్వారా బయటపెట్టారు అధికారులు.

కరెంటు ఉత్పత్తి..

మెట్రోరైలుకి పెద్ద స్థాయిలో కరెంటు అవసరం. రైళ్లు కరెంటుతో నడుస్తాయి. రైల్వే స్టేషన్లలో ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, ఇతర అవసరాలకు కూడా పెద్ద ఎత్తున కరెంటు అవసరం. అయితే హైదరాబాద్ మెట్రో కరెంటుని వినియోగించుకోవడమే కాదు, పునరుత్పత్తి కూడా చేస్తుంది. హైదరాబాద్ మెట్రోకి రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ఉంది. అంటే రైలుకి బ్రేక్ వేసిన ప్రతి సారీ కరెంటు ఉత్పత్తి అవుతుంది, అది పునర్వినియోగం అవుతుంది. మెట్రోరైళ్లు నడిచేందుకు కావాల్సిన ట్రాక్షన్‌ విద్యుత్తులో 40 శాతం బ్రేకింగ్‌ ద్వారానే తయారవుతోంది. గత ఆర్థిక సంవత్సరం 36 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు మెట్రో బ్రేకింగ్‌ ద్వారా ఉత్పత్తి అయింది. ఇది హైదరాబాద్‌ నగరానికి 12 గంటలు విద్యుత్ సరఫరాకు సమానం.

సౌర విద్యుత్ కూడా..

బ్రేకింగ్ వ్యవస్థ ద్వారానే కాదు, మెట్రో రైల్వేస్టేషన్లు, రైలు డిపోల వద్ద ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా 11 మిలియన్‌ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. మెట్రో మొత్తం కరెంటు వినియోగంలో ఇది 10 శాతానికి సమానం కావడం విశేషం.

కాలుష్యాన్ని తగ్గించడం..

హైదరాబాద్ కి మెట్రో వచ్చిన తర్వాత ట్రాఫిక్ తగ్గడంతోపాటు, కాలుష్యం కూడా తగ్గింది. మెట్రో లేకపోతే ప్రయాణికులు కచ్చితంగా వాహనాలను ఆశ్రయించేవారు. అంటే కర్బన ఉద్గారాల ఉత్పత్తి కచ్చితంగా పెరిగేది. మెట్రో వల్ల ఆమేరకు వ్యక్తిగత వాహనాలు, ఇతర వాహనాల వినియోగం తగ్గింది. మెట్రో వల్ల పరోక్షంగా నగరం మొత్తంలో 28 మిలియన్‌ లీటర్ల పెట్రోలు, డీజిల్‌ ఆదా అయిందనమాట. పైగా కొన్ని లక్షల పనిగంటలు కూడా ఆదా అయ్యాయి, చౌకయిన ప్రయాణం కావడంతో ఆర్థికంగా కూడా ఇది ప్రయాణికులకు మేలు చేసింది. 

Tags:    
Advertisement

Similar News