ఫార్ములా-ఇ రేస్ కి ముస్తాబవుతున్న హైదరాబాద్..
ఫార్ములా-ఇ రేస్ కోసం ప్రత్యేకంగా 4 లైన్ల ట్రాక్ లు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో 2.8 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి.
ఫార్ములా-1 రేస్ గురించి మనందరికీ తెలుసు. స్పీడ్ రేస్ లపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంచేందుకు, వాటి గురించి చర్చ జరిగేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకంగా రేస్ నిర్వహిస్తున్నారు. దాని పేరు ఫార్ములా-ఇ. ఇప్పటి వరకూ ప్రపంచంలో 9 నగరాల్లో మాత్రమే ఈ రేస్ జరిగింది. తాజాగా హైదరాబాద్ దీనికి వేదికగా మారింది. 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో ఫార్ములా-ఇ రేస్ లు జరుగుతాయి. ఫిబ్రవరి-6 నుంచే సందడి మొదలవుతుంది.
ఫార్ములా-ఇ రేస్ కోసం ప్రత్యేకంగా 4 లైన్ల ట్రాక్ లు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో 2.8 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. మింట్ కాంపౌండ్, ఐమ్యాక్స్, ఎన్టీఆర్ మార్గ్ లో ప్రస్తుతం ఉన్న రోడ్లపైనే బ్లాక్ టాపింగ్ చేస్తున్నారు. ఈ ట్రాక్ పై ఎలక్ట్రిక్ వాహనాలు గంటకు 200 కి.మీ. వేగంతో దూసుకెళ్తాయని అంటున్నారు. ఈ ట్రాక్ లో మొత్తం 11 ప్రాంతాల్లో మలుపులు ఉంటాయి. ట్రాక్ పనులు పూర్తి అయిన తర్వాత అంతర్జాతీయ నిపుణులు భద్రత పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని ప్రమాణాలు పాటించినట్లు సంతృప్తి చెందితేనే పోటీలకు అనుమతిస్తారు. ట్రాక్ తో పాటు, డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక గదులు నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ కార్లకు ఫార్ములా-ఇ పేరుతో రేస్ లు పెడుతున్నారు. ప్రపంచంలో ఈ రేస్ జరగబోతోన్న 10వ నగరం హైదరాబాద్ కావడం విశేషం. ఎలక్ట్రికల్ వాహనాల పరిశ్రమలకు రాష్ట్రాన్ని పెట్టుబడి గమ్యస్థానంగా మార్చేందుకు ఈ దఫా ఇక్కడ రేస్ లు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఫార్ములా-ఇ రేస్ తో హైదరాబాద్ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.