ఆఫీస్ స్పేస్ వినియోగంలో దేశంలో హైదరాబాద్ నెంబర్ -1
ఇప్పటి వరకూ బెంగళూరు ఆ స్థానంలో ఉండగా, ఈ ఏడాది బెంగళూరుని హైదరాబాద్ వెనక్కి నెట్టింది. అమెరికా, యూరప్ తర్వాత అత్యధిక ఐటీ కార్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉండటం మరో విశేషం.
ఐటీ ఉద్యోగాల్లో సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరుని వెనక్కి నెట్టి దేశంలోనే నెంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్న హైదరాబాద్, ఇప్పుడు మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే ఆఫీస్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ నెంబర్-1గా నిలిచింది. ఇప్పటి వరకూ బెంగళూరు ఆ స్థానంలో ఉండగా, ఈ ఏడాది బెంగళూరుని హైదరాబాద్ వెనక్కి నెట్టింది. అమెరికా, యూరప్ తర్వాత అత్యధిక ఐటీ కార్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉండటం మరో విశేషం.
కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపార అధ్యయన సంస్థ 'వెస్టియన్' తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 'హైదరాబాద్ 2.0' పేరుతో విడుదలైన ఈ నివేదికలో 2016 నుంచి 2022 వరకు ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, బయోటెక్నాలజీ, లాజిస్టిక్స్ తోపాటు ఇతర రంగాల్లో నమోదైన అభివృద్ధిని విశ్లేషించారు. అదే సమయంలో ఆఫీస్ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్న స్థలం పరిమాణాన్ని లెక్కగట్టారు. 2019లో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిందని తెలుస్తోంది. దాదాపు 1.15 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ వినియోగంలోకి వచ్చింది. దానికి అనుగుణంగానే ఆఫీస్ స్పేస్‌ని అద్దెకు తీసుకునే కంపెనీల సంఖ్య పెరిగింది.
కొవిడ్ సంక్షోభ సమయంలో కూడా మిగతా నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్ మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు తేలింది. 2021లో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 69.6 లక్షల చదరపు అడుగులు గా ఉంది. ఈ ఏడాది తొలి అర్థ భాగంలో వ్యాపార సంస్థలు 44 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకొన్నాయి. గతంలో ఉన్న డిమాండ్ కంటే ఇది దాదాపు 72 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 2016లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆఫీస్ స్పేస్ వినియోగంలో తెలంగాణ వాటా 13 శాతం కాగా ఇప్పుడది 25 శాతానికి చేరుకుంది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటంతోపాటు.. అద్దెలు కూడా చాలా తక్కువగా ఉండటం హైదరాబాద్‌కి అడ్వాంటేజ్‌గా మారింది.