ప్రపంచంలో అత్యధిక ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నది హైదరాబాద్‌లోనే.. మంత్రి కేటీఆర్
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ప్రస్తుతం ఏడాదికి 900 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నాయని.. వచ్చే ఏడాదికల్లా 1400 కోట్ల డోసులకు ఈ పరిమాణం పెరుగుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ప్రపంచంలో అత్యధిక ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నది హైదరాబాద్‌లోనే అని మంత్రి కేటీఆర్ అన్నారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్‌డీఏ) ఆమోదించిన యూనిట్లు కలిగిన సింగిల్ ప్రావిన్స్ (స్టేట్) తెలంగాణ కాగా.. ఆ తర్వాతి స్థానంలో అమెరికాలోని న్యూజెర్సీ ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 214 యూనిట్లు ఉండగా.. న్యూజెర్సీలో 189 యూనిట్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న హ్యూమన్ వ్యాక్సిన్లలో మూడొంతులు (35 శాతానికి పైగా) హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని ఆయన తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ప్రస్తుతం ఏడాదికి 900 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నాయని.. వచ్చే ఏడాదికల్లా 1400 కోట్ల డోసులకు ఈ పరిమాణం పెరుగుతుందని ఆయన చెప్పారు. ఇది ప్రపంచ ఉత్పత్తిలో 50 శాతమని ఆయన వెల్లడించారు. దీనితో పాటు హైదరాబాద్ కేంద్రంగా భారీ మెడికల్ డివైజెస్ ప్రొడ్యూస్ అవుతున్నట్లు తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ హైదరాబాద్‌లో ఉన్నదని.. ఇది లైఫ్ సైన్సెస్ హబ్‌గా మారబోతోందని ఆయన అన్నారు. ఈ మేరకు గురువారం ఉదయం మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
త్వరలో హైదరాబాద్ సమీపంలో ఫార్మా సిటీని ప్రారంభించబోతున్నామని.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా అవతరించబోతోందని అన్నారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే 20వ బయో ఏషియా సదస్సుకు 50 దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు వస్తారని కేటీఆర్ చెప్పారు. ఈ సారి యూకే, బెల్జియం నుంచి కూడా ప్రత్యేక ఆహ్వానితులు రాబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గత 19 ఏళ్లుగా బయో ఏషియాను నిర్వహిస్తున్నామని.. ఈ సారి జరగబోయే 20వ సదస్సు ప్రత్యేకమైనదని మంత్రి తెలిపారు. ఈ సదస్సులో మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అనేక అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకోబోతున్నామని.. కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించబోతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సదస్సుకు రాబోయే కంపెనీ ప్రతినిధులతో తరచుగా మాట్లాడుతున్నానని.. తప్పకుండా ఈవెంట్ సక్సెస్ అవుతుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.