ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణాన్ని వేగవంతం చేయాలని HAML నిర్ణయం - మార్గాన్ని పరిశీలించిన MD
Hyderabad Airport Metro Express: ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ నిర్మాణం కోసం సర్వే పనులను ప్రారంభించి, సర్వే బృందాలకు దిశా నిర్దేషం చేయడం కోసం, HAML MD NVS రెడ్డి, సీనియర్ ఇంజనీర్ల బృందం ఈ రోజు (ఆదివారం) రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి నార్సింగి జంక్షన్ వరకు ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గాన్ని పరిశీలించారు.
ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ నిర్మాణం వేగవంతం చేసేందుకు అలైన్‌మెంట్ ఖరారు చేయాల్సి ఉంది. అందుకోసం కావాల్సిన డేటా సేకరణ చాలా ముఖ్యమైనది. మెట్రో పిల్లర్లు, స్టేషన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి, స్టేషన్ల ఎత్తులు, వయాడక్ట్ ప్రొఫైల్ మొదలైనవాటిని నిర్ణయించడానికి ఈ డేటా కీలకం.గ్రౌండ్ డేటాను సేకరించడానికి రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసింది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML).
.సర్వే పనులను ప్రారంభించి, సర్వే బృందాలకు దిశా నిర్దేషం చేయడం కోసం, HAML MD NVS రెడ్డి, సీనియర్ ఇంజనీర్ల బృందం ఈ రోజు (ఆదివారం) రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి నార్సింగి జంక్షన్ వరకు ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గాన్ని పరిశీలించారు. దాదాపు 10 కి.మీ పొడవునా నడిచి, ఎన్‌విఎస్ రెడ్డి HAML ఇంజనీర్లు, సర్వే బృందాలకు ఈ క్రింది ఆదేశాలను ఇచ్చారు:
స్టేషన్ లు ప్రధాన రహదారి జంక్షన్‌లకు దగ్గరగా ఉండాలి. ఇది విమానాశ్రయ ప్రయాణీకులకు మాత్రమే కాకుండా, సిఎం కేసీఆర్ కోరుకున్నట్టు శివారు ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడాలి. తద్వారా తక్కువ ఆదాయ వర్గాలు కూడా నగర శివార్లలో మెరుగైన ఇళ్ళలో ఉండి పని ప్రదేశాలకు 20 నిమిషాల్లో చేరుకోగలుగుతారు.
ఎయిర్ పోర్ట్ మెట్రో లైన్ ప్రాంతం ఇప్పటికే చాలా అభివృద్ది చెందింది. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కట్టడాలున్నాయి. భవిష్యత్తులో మరింత అభివృద్ది చెందుతుంది. అందువల్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మెట్రో స్టేషన్లు, అవసరమైన స్కై వాక్ ల నిర్మాణాలు ఎక్కడ, ఎలా ఉండాలన్న విషయాలను, మెట్రో స్టేషన్లకు సమీపంలో వున్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్రయాణీకుల వాహనాల పార్కింగ్ ఏరియా కోసం సూచించాలన్నారు.
ప్రస్తుతం ఉన్న కారిడార్ 3 (బ్లూ లైన్)ను రాయదుర్గ్ స్టేషన్ ను 900 మీటర్ల మేర పొడిగించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం స్టేషన్ ఉన్న ప్రదేశంలో స్థలాభావం వున్నందువల్ల IKEA భవనం తర్వాత L&T - అరబిందో భవనాల ముందు ఈ రెండు కొత్త స్టేషన్‌లు ఒకదానిపై ఒకటి నిర్మించే అవకాశాన్ని పరిశీలించమన్నారు.
ప్రస్తుతం అమీర్ పేట, జెబియస్ స్టేషన్ వద్ద ఉన్న విధంగా రాయ దుర్గ్ స్టేషన్ మొదటి రెండు అంతస్తుల్లో ఎయిర్ పోర్ట్ వెళ్ళే రైళ్ళకోసం, పొడిగించబడిన కొత్త బ్లూ లైన్ స్టేషన్ ఎగువ రెండు అంతస్తుల్లో ఉండేలా డిజైన్ చేయాలని అన్నారు.
కొత్తగా నిర్మించబోతున్న ఎయిర్‌పోర్ట్ మెట్రో రాయ దుర్గ్ స్టేషన్‌కి ఆనుకొని TSTRANSCO కొత్తగా వేసిన 400 kV హై వోల్టేజ్ భూగర్భ విద్యుత్ కేబుల్‌లను తొలగించడం అవసరం లేకుండా నిర్మాణాలు చేపట్టాలని ఎండీ ఆదేశించారు.
భవిష్యత్తులో నిర్మించబోయే BHEL-లక్డీ కా పూల్ మెట్రో కారిడార్ స్టేషన్ ను దృష్టిలో ఉంచుకొని రాయ దుర్గ్ కొత్త స్టేషన్ ను ప్లాన్ చేయాలని ఆయన సూచించారు.
నానక్‌రామ్‌గూడ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్ నిర్మాణ సమయంలో అక్కడి ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని స్కై వాక్ ల నిర్మాణం చేపట్టాలన్నారు.పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలన్నారు.
నార్సింగి-కోకాపేట్ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతున్నదని, కాలనీలు, ఎత్తైన కమర్షియల్, రెసిడెన్షియల్ భవనాల భారీ పెరుగుదల అవసరాలను తీర్చే విధంగా నార్సింగి జంక్షన్ సమీపంలో స్టేషన్ స్థానాన్ని ప్లాన్ చేయాలి. ఈ స్టేషన్ డిజైన్, లొకేషన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవతలి వైపు నుండి వచ్చే ప్రయాణికులను కూడా దృష్టిలో ఉంచుకొని జరగాలి. .
ఈ రోజు మెట్రో మార్గాన్ని పరిశీలించే కార్యక్రమంలో HAML MD NVS రెడ్డితో పాటు HAML చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ DVS రాజు, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ B ఆనంద్ మోహన్, GM లు M విష్ణువర్ధన్ రెడ్డి , రాజేంద్ర ప్రసాద్ నాయక్ , ఇతర సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు.