స్పేస్ హబ్‌గా మారుతున్న హైదరాబాద్.. నేడు నింగిలోకి ఇండియా తొలి ప్రైవేట్ శాటిలైట్లు

థైబోల్ట్-1, థైబోల్ట్-2 అనే నానో శాటిలైట్లను ఇస్రో తమ పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నది. ఒక వేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇండియాలో ప్రైవేట్ శాటిలైట్ రూపొందించిన సంస్థగా ధ్రువ స్పేస్ చరిత్ర సృష్టించనున్నది.

Advertisement
Update:2022-11-26 06:18 IST

ఐటీ, ఫార్మా రంగంలో దూసుకొని పోతున్న హైదరాబాద్ నగరం.. ఇకపై స్పేస్ హబ్‌గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంతో పాటు చుట్టు పక్కల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకున్నది. దీంతో అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. ఇక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు అనేకం హైదరాబాద్‌లోకే ఉన్నాయి. డీఆర్‌డీఓ, బీడీఎల్, ఎన్‌ఎఫ్‌సీ, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, మిధాని వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా డిఫెన్స్ మినిస్ట్రీకి చెందిన కీలకమైన డీఆర్‌డీవో ఇక్కడ ఉండటం.. వాటితో పాటే మిధాని వంటి సంస్థ ఉండటంతో అంతరిక్ష ప్రయోగాలకు అనువైన రాకెట్లు, శాటిలైట్లు తయారు చేయడానికి ప్రైవేట్ కంపెనీలకు కూడా అనుకూలంగా మారింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రైవేటు సంస్థలను కూడా ప్రోత్సహిస్తుండటంతో అనేక స్టార్టప్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న 'స్కైరూట్ ఏరోస్పేస్' అనే సంస్థ ఇండియాలోనే తయారైన తొలి ప్రైవేట్ రాకెట్‌ను రూపొందించింది. గత వారమే ఇది విజయవంతంగా శాటిలైట్లను తీసుకొని విజయవంతంగా నింగిలోకి వెళ్లింది. ఇన్నాళ్లూ ఇస్రో మాత్రమే రూపొందిస్తూ వచ్చిన క్రయోజనిక్ ఇంజన్లను హైదరాబాద్ సంస్థ కూడా తయారు చేసి చూపించింది.

ఇక ఇప్పుడు మరో స్టార్టప్ కంపెనీ ఏకంగా తొలి ప్రైవేట్ శాటిలైట్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కు చెందిన 'ధ్రువ స్పేస్' అనే సంస్థ ఇండియాలో తొలి ప్రైవేట్ శాటిలైట్లను రూపొందించింది. 2012లో ప్రారంభమైన ఈ కంపెనీ.. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని పదేళ్ల తర్వాత తొలి ప్రైవేట్ శాటిలైట్ రూపొందించడం గమనార్హం. శనివారం ఉదయం 11.56కు వీళ్లు రూపొందించిన థైబోల్ట్-1, థైబోల్ట్-2 అనే నానో శాటిలైట్లను ఇస్రో తమ పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నది. ఒక వేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇండియాలో ప్రైవేట్ శాటిలైట్ రూపొందించిన సంస్థగా ధ్రువ స్పేస్ చరిత్ర సృష్టించనున్నది.

ధ్రువ స్పేస్ సంస్థ రూపొందించిన రెండు శాటిలైట్లు కూడా 'లో డేటా రేట్ కమ్యునికేషన్' కోసం ఉపయోగిస్తారు. 'లో డేటా రేట్ కమ్యునికేషన్‌'ను మారుమూల ప్రాంతాల్లోని నేల పరిస్థితులు, పంటల నాణ్యత, భారీ పైపులైన్ల లీకేజీలు, పార్కింగ్ స్పేస్‌ గుర్తింపు, సప్లై చెయిన్ మానిటరింగ్, అటవీ ప్రాంతాల్లో చెలరేగే మంటలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.

ధ్రువ స్పేస్‌ను 2012లో సంజయ్ నెక్కంటి ప్రారంభించారు. 2010లో హైదరాబాద్, బెంగళూరుకు చెందిన ఏడు ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులు కలిసి స్టడ్‌శాట్‌ అనే నానో శాటిలైట్ తయారు చేశారు. అందులో సంజయ్ నెక్కంటి కూడా ఒకరు. కాగా, 2019లో తన స్నేహితులైన కృష్ణతేజ పెనమకూరు, అభయ్ ఇగూర్, చైతన్యదొర సూరపురెడ్డి ధ్రువ్ స్పేస్‌లో జాయిన్ అయ్యారు.

స్పేస్ సెక్టార్‌లో ఇస్రో ఎంతో వేగంగా అడుగులు వేస్తోంది. అయితే కమర్షియల్ శాటిలైట్లు తయారు చేసే సంస్థలు ఇండియాలో లేవు. అందుకే మేము తక్కువ ఖర్చుతో చౌకైన శాటిలైట్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. పాశ్చాత్య దేశాలు తయారు చేసే శాటిలైట్లతో పోల్చుకుంటే మనం అత్యంత తక్కువ ఖర్చుతో వాటిని తయారు చేయవచ్చు అని చైతన్య దొర అంటున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీ 350 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోంది. అందులో ఇండియా వాటా కేవలం 2 శాతం మాత్రమే. 2040లో స్పేస్ ఇండస్ట్రీ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ స్టార్టప్ మొదలు పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు.

వ్యాపారంగా లాభదాయకమైన శాటిలైట్లను లాంఛ్ చేయడం ద్వారా ఇండియా తమ నెట్‌వర్క్‌ను పెంచుకునే వీలుంది. ఎలాన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా చాలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నారు. అలాంటి ప్రయోగాలు మనం కూడా చేయాలని సూరపురెడ్డి చెబుతున్నారు. ఇక బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన పిక్సెల్ అనే స్టార్టప్ కంపెనీ తమ మూడో శాటిలైట్‌ను ఇదే పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా పంపిస్తోంది. అయితే అది అమెరికా సహకారంతో తయారైన శాటిలైట్. పిక్సెల్ శాటిలైట్ మీద అమెరికా జెండా ఉంటుంది. కానీ, ధ్రువ్ శాటిలైట్లపై భారత జెండా ఉండనున్నది.

Tags:    
Advertisement

Similar News