హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ సైక్లింగ్ ఫెస్టివల్స్ -మంత్రి కేటీఆర్
దక్షిణ కొరియాలోని సైకిల్ ట్రాక్ లను పరిశీలించి అధ్యయనం చేసి, అధికారులు హైదరాబాద్ లో అలాంటి ఎకో ఫ్రెండ్లీ ట్రాక్ ని రూపొందించారు. సోలార్ రూఫ్ ఉన్న ఈ సైకిల్ ట్రాక్ ప్రపంచంలోనే రెండోది, దేశంలో మొట్ట మొదటిది.
హైదరాబాద్ వంటి నగరంలో ఫార్ములా రేస్ లు జరుగుతాయని ఎవరూ ఉహించి ఉండరు. కానీ ఎలక్ట్రానిక్ కార్లతో జరిగిన ఫార్ములా-ఇ రేసింగ్ హైదరాబాద్ కి దేశంలోనే ప్రత్యేక స్థానం తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ సైక్లింగ్ ఫెస్టివల్స్ కి కూడా హైదరాబాద్ వేదిక అయ్యే అవకాశముంది. ఆరోజు ఎంతో దూరంలో లేదు అని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 23కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు సైకిల్ తొక్కి సైక్లిస్ట్ లను ఉత్సాహపరిచారు. మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, అధికారులు, హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ (HCG) ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
23కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ సైకిల్ ట్రాక్ ని సర్వాంగ సుందరంగా రూపొందించారు. పైన ఉన్న రూఫ్ టాప్ పై సోలార్ సిస్టమ్ ని అమర్చారు. దాని ద్వారా 16మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 24 గంటలు ఇది అందుబాటులో ఉంటుంది. సాయంత్రం కాగానే పూర్తి స్థాయిలో లైట్లు వెలుగుతాయి. సోలార్ విద్యుత్ దీనికి ఉపయోగపడుతుంది. సైకిల్ ట్రాక్ కి ఇరువైపులా పచ్చదనం ఆహ్లాదకరంగా ఉంటుంది. 23కిలోమీటర్ల ఈ ట్రాక్ ఆకర్షణీయంగా తయారైంది. దేశంలోనే ఇలాంటి ట్రాక్ ఇదే మొదటిది కావడం విశేషం. దక్షిణ కొరియాలోని సైకిల్ ట్రాక్ లను పరిశీలించి అధ్యయనం చేసి, అధికారులు హైదరాబాద్ లో అలాంటి ఎకో ఫ్రెండ్లీ ట్రాక్ ని రూపొందించారు. సోలార్ రూఫ్ ఉన్న ఈ సైకిల్ ట్రాక్ ప్రపంచంలోనే రెండోది, దేశంలో మొట్ట మొదటిది.
నిరంతర పర్యవేక్షణ..
సైకిల్ ట్రాక్ వెంట సైక్లిస్ట్ లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సీసీ కెమెరాలు అమర్చారు. సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో వీటిని పర్యవేక్షిస్తారు. త్వరలో సైకిళ్లను అద్దెకిచ్చే ఏజెన్సీలు కూడా వస్తాయి. సైకిల్ ట్రాక్ వెంట ఆరోగ్యకరమైన పదార్థాలు, రిటైల్ కియోస్క్ లు, స్కేటింగ్ రింగ్, టెన్నిస్ కోర్టులు, బ్యాడ్మింటన్ కోర్టులు, స్పోర్టింగ్ రిటైల్ షాపులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
త్వరలో మరిన్ని ట్రాక్ లు..
త్వరలోనే నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట నియోపోలిస్, బుద్వేల్ లో కూడా ఇలాంటి సైకిల్ ట్రాక్ లను నిర్మిస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్. గండిపేట జలాశయం చుట్టూ 46 కి.మీ. మేర సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. నగరం అంతర్జాతీయ సైక్లింగ్ వేడుకలకు వేదికగా నిలుస్తుందన్నారు.