ఫైనల్ స్టేజ్ లో హైదరాబాద్ సైకిల్ ట్రాక్.. భారత్ లోనే ఇది ప్రత్యేకం
4.5 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ ట్రాక్ లో అక్కడక్కడ సైక్లింగ్ చేస్తున్నట్టుగా ఉన్న స్టీల్ ఎంబ్లమ్ లు ఏర్పాటు చేస్తున్నారు. సైకిల్ ట్రాక్ కి ఇవి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
హైదరాబాద్ లో సైకిల్ ట్రాక్ లు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో మొత్తం 90 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా వీటిని వినియోగంలోకి తెచ్చారు. అయితే ఔటర్ రింగ్ రోడ్ పై ఏర్పాటు చేస్తున్న సైకిల్ ట్రాక్ మాత్రం ఇందులో చాలా ప్రత్యేకం. దీని పొడవు 23 కిలోమీటర్లు. ప్రస్తుతం ఇక్కడి పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్ పై 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది సోలార్ రూఫ్ టాప్ తో కూడి ఉన్న ట్రాక్. ట్రాక్ కి రెండు వైపులా పచ్చదనం ఉంటుంది. దీనికోసం మొక్కలు పెంచుతున్నారు. 4.5 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ ట్రాక్ లో అక్కడక్కడ సైక్లింగ్ చేస్తున్నట్టుగా ఉన్న స్టీల్ ఎంబ్లమ్ లు ఏర్పాటు చేస్తున్నారు. సైకిల్ ట్రాక్ కి ఇవి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. సైకిల్ ట్రాక్ ఏర్పాట్లు, అక్కడ పనుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తాజాగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన కేటీఆర్ ని కూడా మెన్షన్ చేశారు.
దేశంలో ఇదే ప్రథమం..
ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఏర్పాటు చేస్తున్న సైకిల్ ట్రాక్ అందుబాటులోకి వస్తే దేశంలో సోలార్ రూఫ్ టాప్ ఉన్న ట్రాక్ గా ఇది ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఇప్పటికే దేశంలో పలు నగరాల్లో సైకిల్ ట్రాక్ లు అందుబాటులో ఉన్నా కూడా వాటిపై సోలార్ రూఫ్ టాప్ లు లేవు. హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న 90 కిలోమీటర్ల పొడవైన సైకిల్ ట్రాక్ లో ఆర్ఆర్ఆర్ వద్ద ఏర్పాటు చేస్తున్న 23 కిలోమీటర్ల ట్రాక్ కి సోలార్ రూఫ్ టాప్ ఉంటుంది. దీని వల్ల సోలార్ పవర్ కూడా ఉత్పత్తి అవుతుంది. పర్యావరణానికి ఇది మరింత హితకారిణి అంటున్నారు అధికారులు.