అధిక వడ్డీ ఆశ చూపి.. భారీ మోసం.. - రూ.514 కోట్ల డిపాజిట్లు సేకరించిన వైనం

తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి చైర్మన్‌ కమలాకర్‌ శర్మను అరెస్ట్‌ చేశారు.

Advertisement
Update:2024-07-09 08:51 IST

హైదరాబాద్‌లోని ధన్వంతరి ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు అధిక వడ్డీ ఆశ చూపి భారీ స్థాయిలో డిపాజిట్లు సేకరించి డిపాజిట్‌ దారులను మోసం చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధన్వంతరి ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ పేరుతో దాని చైర్మన్‌ కమలాకర్‌ శర్మ బాధితుల నుంచి కోట్లాది రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేశారు. మొత్తం రూ.514 కోట్లు ఈ విధంగా వారు సేకరించినట్టు తేలింది.

డిపాజిట్లు చేసినవారిలో కొందరికి ఇంటి స్థ‌లాలు ఇస్తామని చెప్పి ఫౌండేషన్‌ మోసం చేసింది. ఇలా మోసపోయినవారంతా 4 వేల మంది వరకు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితులంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి చైర్మన్‌ కమలాకర్‌ శర్మను అరెస్ట్‌ చేశారు.

దీనిపై తాజాగా సీసీఎస్‌ డీసీపీ శ్వేతారెడ్డి దాదాపు 200 మంది బాధితులతో సమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫౌండేషన్‌ పేరు మీద ఉన్న ఆస్తులను జప్తు చేశామని ఆమె తెలిపారు. వాటిని విక్రయించి నగదు డిపాజిట్లు చెల్లించే ఏర్పాట్లు చేస్తామని ఆమె బాధితులకు హామీ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News