కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త

ఇటీవల సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ కూడా రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుకి కారణం అయింది. ఇప్పుడు కంటోన్మెంట్ విజయం తమదంటే తమదని చెప్పుకుంటున్నారు నేతలు.

Advertisement
Update:2024-06-29 22:35 IST

హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు నిజంగా ఇది శుభవార్త. కంటోన్మెంట్ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కంటోన్మెంట్ వాసుల కల నెరవేరినట్టయింది. ఇప్పటి వరకూ ఆ ప్రాంతం రక్షణ శాఖ పరిధిలోకి రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కుదిరేది కాదు, స్థానిక సమస్యలను పరిష్కరించే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది కాదు, కనీసం ఫ్లైఓవర్ నిర్మించాలన్నా కేంద్రం అనుమతులివ్వని పరిస్థితి. ఇప్పుడీ పరిస్థితి మారింది. దేశవ్యాప్తంగా రక్షణ శాఖ పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ ప్రాంతాలపై పెత్తనం వదులుకుంటున్న కేంద్రం.. తాజాగా హైదరాబాద్ కంటోన్మెంట్ వాసులకు కూడా శుభవార్త చెప్పింది.

ఆ ఘనత మాదే..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే కంటోన్మెంట్ ప్రాంతం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. కేంద్ర రక్షణ మంత్రికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చేసిన విజ్ఞప్తి ఫలించిందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మార్చి 6, 2024 నాడు సీఎస్, కేంద్రానికి రాసిన లేఖకు ఇప్పుడు సానుకూల ఫలితం వచ్చిందని చెబుతున్నారు. కాంగ్రెస్ చొరవతోనే కంటోన్మెంట్ పై అధికారాలను జీహెచ్ఎంసీకి అప్పగించారంటూ ఆ పార్టీ ట్వీట్ వేసింది. ప్రజా ప్రభుత్వం సాధించిన విజయం ఇది అని చెప్పుకుంటోంది.


కాదు మాదే..

కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీకి అప్పగిస్తూ రక్షణ శాఖ తీసుకున్న నిర్ణయం ఉమ్మడి పోరాట ఫలితం అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. 2014 నుంచి రక్షణ శాఖ మంత్రుల్ని కలిసి కేటీఆర్ వినతిపత్రాలు ఇచ్చారని, ప్రజా పోరాటాన్ని ఆయన గొప్పు మలుపు తిప్పారని చెబుతున్నారు. కేటీఆర్ పోరాట ఫలితంగా ప్రజల ఆకాంక్ష నెరవేరిందని చెప్పుకొచ్చారు.



ప్రస్తుతం కంటోన్మెంట్ వ్యవహారం రెండు పార్టీల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ కూడా రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుకి కారణం అయింది. ఇప్పుడు కంటోన్మెంట్ విజయం తమదంటే తమదని చెప్పుకుంటున్నారు నేతలు. 

Tags:    
Advertisement

Similar News