హెల్త్ కేర్ రంగంలో భారీ పెట్టుబడులు.. సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ
ఇప్పటికే హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ హెల్త్‌కేర్ ఎక్చేంజ్ (జీహెచ్ఎక్స్) తమ సంస్థను మరింతగా విస్తరించనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ హెల్త్ కేర్ రంగంలో భారీ పెట్టుబడులకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. అక్కడ పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా భారీ విస్తరణను చేపట్టడానికి గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్చేంజ్, మెట్‌లైప్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ హెల్త్‌కేర్ ఎక్చేంజ్ (జీహెచ్ఎక్స్) తమ సంస్థను మరింతగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. నగరంలో ప్రస్తుతం హెల్త్ కేర్ రంగానికి అద్భుతమైన, అనుకూలమైన వాతావరణం ఉండటంతో అనేక సంస్థల కలయికతో మంచి ఎకో సిస్టం ఉన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎక్స్ చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ క్రిస్టీ లియోనార్డ్ బృందం మంత్రి కేటీఆర్‌తో న్యూయార్క్‌లో సమావేశం అయ్యారు.
హెల్త్‌కేర్ కంపెనీలు పెద్దఎత్తున డిజిటలీకరణ చెందుతున్నాయని, ఐటీ ఆధారిత సేవల విస్తరణపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని సంస్థ సీటీఓ సీజే సింగ్ వెల్లడించారు. ఈ దిశగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటామని.. 2025 నాటికి కార్యకలాపాలు మూడింతలు పెంచేలా ప్రణాళికలు, ఇంజనీరింగ్, ఆపరేషన్లను విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.
మెట్‌లైఫ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్..
ఆర్థిక సేవలు, బీమా రంగ దిగ్గజ సంస్థ మెట్‌లైఫ్.. హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ కేంద్ర కార్యాలయంలో సంస్థ సీనియర్ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. నగరంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి మెట్‌లైఫ్ ముందుకు వచ్చింది.
బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేలా మెట్‌లైఫ్ నిర్ణయం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మెట్‌లైఫ్ సంస్థను సాదరంగా హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూయార్క్‌లో విద్యార్థిగా, ఉద్యోగిగా ఉనన కాలంలో మెట్‌లైఫ్ కేంద్ర కార్యాలయ భవనం రాజసం, నిర్మాణ శైలి తనను ఆశ్చర్యానికి గురి చేసేది. ఇప్పుడు అదే కార్యాలయంలో సొంత రాష్ట్రానికి పెట్టుబడులు కోరుతూ సమావేశం కావడం అత్యంత సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.