బీజేపీలో టికెట్ల కోసం భారీ పోటీ.. మొత్తం అప్లికేషన్లు 6,003
ఇవాళ స్క్రీనింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మొదట దరఖాస్తులను నియోజకవర్గాల వారీగా విభజించి ఆశావహుల లిస్టు ప్రిపేర్ చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం బీజేపీకి దరఖాస్తులు పోటెత్తాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకోసం 6,003 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు ఏకంగా 2,781 అర్జీలు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో మహిళలు అధికంగా ఉన్నారు. స్వీకరణ ప్రక్రియ ఈనెల 4న ప్రారంభం కాగా.. ఆదివారంతో ముగిసింది.
ఇక ఇవాల్టి నుంచి దరఖాస్తులను స్క్రీనింగ్ చేయనున్నారు. ఇందుకోసం ఇవాళ స్క్రీనింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మొదట దరఖాస్తులను నియోజకవర్గాల వారీగా విభజించి ఆశావహుల లిస్టు ప్రిపేర్ చేయనున్నారు. తర్వాత గైడ్‌లైన్స్ ప్రకారం ప్రాధాన్యత క్రమంలో అప్లికేషన్లను రెడీ చేస్తారని చెప్పారు పార్టీ నేతలు. పోటీ చేయాలనుకున్నవారిలో కొందరు నేరుగా దరఖాస్తు అందజేయగా.. మరికొందరి తరఫున వారి అనుచరులు అర్జీలు సమర్పించారు. ఇక ఇప్పటికే వరుస కార్యక్రమాలకు షెడ్యూల్ ప్రకటించిన బీజేపీ.. సమాంతరంగా అభ్యర్థులను ఫైనల్ చేయనుంది. ఈనెల 26 నుంచి రాష్ట్రంలో బస్సు యాత్రలకు బీజేపీ ప్లాన్ చేసింది. ఆలోపే అభ్యర్థులను ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆదివారం దరఖాస్తు చేసుకున్న వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. మాజీ మంత్రి బాబుమోహన్ ఆందోల్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. సినీ నటి జీవిత సనత్‌నగర్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి కోసం అర్జీ పెట్టుకుంది. గజ్వేల్ నుంచి ఈటల భార్య జమున తరపున కార్యకర్తలు అర్జీ సమర్పించారు.