ఆరుగురు మహిళలను చంపిన యువకుడి అరెస్ట్‌

మే 23న కూడా మహబూబ్‌ నగర్‌ పట్టణం టీడీ గుట్టలోని కూలీల అడ్డా నుంచి ఓ మహిళను కాసమయ్య తన వెంటబెట్టుకొని భూత్పూర్‌ పురపాలిక అమిస్తాపూర్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు.

Advertisement
Update: 2024-06-30 03:39 GMT

ఆరుగురు మహిళలను చంపిన యువకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఓ మహిళా కూలీని హత్య చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడు. విచారణలో 2022 నుంచి మొత్తం ఆరుగురు మహిళలను హతమార్చినట్టు వెల్లడించాడు. మహబూబ్‌ నగర్‌ జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం తన కార్యాలయంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం చింతలకుంటకు చెందిన బోయ కాసమయ్య అలియాస్‌ ఖాసీం (25) కూలి పని చేసేవాడు. మద్యానికి బానిసై, జల్సాలకు అలవాటుపడ్డాడు. రెండేళ్ల క్రితం అతను మహబూబ్‌నగర్‌కు వచ్చి కూలి పనులు చేస్తూ బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై పడుకునేవాడు. కూలి పనుల ద్వారా వచ్చిన డబ్బును మద్యానికి, తిండికి ఖర్చు పెట్టేవాడు.

మరోపక్క అతను తన శారీరక సుఖం కోసం కూలీలు, అమాయకులైన మహిళలను మాయమాటలతో మభ్యపెట్టేవాడు. వారిని డబ్బులిస్తానంటూ దూరప్రాంతాలకు తీసుకెళ్లి శారీరక అవసరాలు తీర్చుకొని ఆ తర్వాత వారికి డబ్బులివ్వకుండా హతమార్చేవాడు. ఈ విధంగా అతను 2022 నుంచి ఇప్పటివరకు ఆరుగురు మహిళలను వివిధ ప్రాంతాల్లో హత్య చేశాడు.

మే 23న కూడా మహబూబ్‌ నగర్‌ పట్టణం టీడీ గుట్టలోని కూలీల అడ్డా నుంచి ఓ మహిళను కాసమయ్య తన వెంటబెట్టుకొని భూత్పూర్‌ పురపాలిక అమిస్తాపూర్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెతో శారీరకంగా కలిసిన అనంతరం ఆమె డబ్బులు అడగగా.. టవల్‌ను మెడకు బిగించి బ్లేడుతో గొంతు కోశాడు. అనంతరం రాయితో ముఖంపై మోది హత్య చేశాడు. అక్కడినుంచి వెళ్లేటప్పుడు ఆమె కాళ్లకు ఉన్న పట్టీలను తస్కరించాడు.

ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన భూత్పూర్‌ పోలీసులు నిందితుడు కాసమయ్యను శనివారం అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌ షాసాబ్‌ గుట్ట వద్ద ఉండగా అతన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన విచారణలో అతను ఆరుగురిని హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. భూత్పూర్‌ పరిధిలో ఇద్దరిని, హన్వాడ, వనపర్తి, బిజినేపల్లి, మహబూబ్‌ నగర్‌ గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఒక్కొక్కరిని హత్య చేసినట్టు వెల్లడించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News