నేడు బుద్వేల్‌లో భూముల వేలం.. 18న మరిన్ని ప్రాంతాల్లో..!
ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉండటం.. ఎయిర్ పోర్టుకు 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకునే వసతి ఉండటంతో.. బుద్వేల్ భూములకు సైతం రికార్డు ధర పలకవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
కోకాపేట భూములు పలికిన ధర.. తెలంగాణ హెచ్ఎండీఏలో కొత్త ఉత్సాహం నింపింది. ఇప్పటికే అభివృద్ధి చేసిన మరిన్ని లే అవుట్ భూముల ఈ- వేలానికి రంగం సిద్ధమైంది. భూములకు దక్కుతున్న డిమాండ్ తో దూకుడు పెంచేసిన హెచ్ఎండీఏ.. నేడు బుద్వేల్ లో తన తదుపరి కార్యాచరణ అమలు చేస్తోంది. సుమారు 182 ఎకరాల్లో.. వంద ఎకరాలకు పైగా ఉన్న 14 ప్లాట్లను తొలి విడతలో వేలం నిర్వహిస్తోంది.
ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉండటం.. ఎయిర్ పోర్టుకు 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకునే వసతి ఉండటంతో.. బుద్వేల్ భూములకు సైతం రికార్డు ధర పలకవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 4న ఈ-భూముల వేలానికి నోటిఫికేషన్ రాగా.. నేడు 2 విడతల్లో ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కనీసం 2 వేల కోట్ల రూపాయలు ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. ఈనెల 18న మరో 26 ప్రాంతాల్లో భూముల ఈ-వేలం జరగనుంది. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 8, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 8, సంగారెడ్డి పరిధిలో మరో 10 ప్రాంతాలు ఉన్నాయి. బైరాగిగూడ, మంచిరేవుల, పీరం చెరువు, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్, చందానగర్, బాచుపల్లి, బౌరంపేట, చెంగిచర్ల, సూరారం, వెలిమల, నందిగామ, అమీన్ పూర్, రామేశ్వరం బండ, పతిఘన్ పూర్, కిష్టారెడ్డిపేట లాంటి మంచి డిమాండ్ ఉన్న ప్రాంతాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. 18 ఈ-వేలం జరగనున్న ఆయా ప్రాంతాల భూములకు.. ఈనెల 16 వరకు రిజిస్ట్రేషన్లు తీసుకుంటారు.
హెచ్ఎండీఏ దూకుడుకు తగ్గట్టే.. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ కూడా.. హైదరాబాద్ భూముల అమ్మకాలు, వాటికి పలుకుతున్న విలువలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే.. మోకిలలో గజం ధర లక్షకు పైగా పలకడం.. కోకాపేటలో ఎకరం ధర ఏకంగా 70 కోట్ల రూపాయలకు పైగా పలకడం చూస్తుంటే.. తాజా అమ్మకాలు కూడా అదే రీతిన జరగడం ఖాయమనిపిస్తోంది.