తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే చరిత్ర క్షమించదు : కేటీఆర్
తెలంగాణ తల్లి విగ్రహాన్ని పేదరికానికి, సమస్యలకు చిహ్నంగా ప్రతిష్టించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ కేటీఆర్ అన్నారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ చరిత్రను చెరిపేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో కేసీఆర్ నిర్మించిన గొప్ప నిర్మాణాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం లేదని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి కొత్త ప్రాజెక్టులకు ప్రముఖుల పేర్లు పెట్టామని ఆయన అన్నారు. తమ పదేళ్ల పాలనలో బతుకమ్మ, బోనాల పండుగలకు రాష్ట్ర పండుగలుగా జరుపుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన చరిత్రను ఎలుగెత్తి చాటుకునే ప్రయత్నం చేశామని అన్నారు. తాము పార్టీ నాయకుల పేర్లు పెట్టి ఏ కార్యక్రమాలు నిర్వహించలేదని తెలిపారు. తెలంగాణ చరిత్ర శాశ్వతంగా నిలవాలనే ప్రయత్నం చేశామని అన్నారు. కవులు, కళాకారులు సాహితీవేత్తలకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ఆయా ప్రాంతాల దేవుళ్ల పేర్లు పెట్టామని అన్నారు. కొత్త జిల్లాలకు ప్రొఫెసర్ జయశంకర్ , కొమురం భీం పేర్లను పెట్టుకున్నామని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మీద ఆక్రోశంతో నేడు ఆ తల్లి రూపాన్నే మార్చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాం గురించి ఒక్క మాట రాదు. శ్వేతసౌధం లాంటి అంబేద్కర్ సచివాలయం గురించి ఒక్క మాట రాదు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక్క మాట రాదు.. ఈ పదేళ్లలో జరిగిన నిర్మాణాల గురించి సీఎంకు మాట రాదు. ఎందుకంటే పరాజితుల చరిత్రను చెరిపేయాలనే మూర్ఖపు నాయకులు ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే చరిత్ర క్షమించదు. ప్రజల నుంచి ఛీత్కారాలు వస్తాయి. ఇప్పటికైనా విజ్ఞతతో ప్రభుత్వం విరమించుకోవాలి.ఎల్లకాలం నీ నాటకలు సాగవు అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు.