మంత్రుల నుంచి ఆరోగ్య కార్యకర్తల వరకు అందరూ కంటి వెలుగులో భాగస్వామ్యం కావాలి : హరీశ్ రావు

రాష్ట్రంలో కంటి సమస్యలతో ఎవరూ బాధపడకూడదనే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Advertisement
Update:2023-01-04 05:49 IST

సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజలకు కంటి సమస్యలు దూరంచేసే లక్ష్యంతో ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్న 'కంటి వెలుగు' రెండో దశ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మంత్రుల నుంచి ఆరోగ్య కార్యకర్తల వరకు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని మంత్రి చెప్పారు. ప్రజలకు ఎంతో మేలు చేసే బృహత్తర పథకంలో అన్ని విభాగాల అధికారులు కూడా తమ వంత సాయం అందించాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా కంటి వెలుగును విజయవంతంగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

కంటి వెలుగు కార్యక్రమం మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం బీఆర్కే భవన్‌లో హరీశ్ రావు ఉన్నత స్థాయి సమీక్ష సమీవేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఇక మంత్రి హరీశ్ చేసిన సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు కూడా పాల్గొని కంటి వెలుగును ఎలా నిర్వహించాలో తెలుసుకున్నారు. నిర్దేశిత సమయంలో కంటి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన అద్దాలు, మందులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్ రావు చెప్పారు.

మొదటి దశలో 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసి, 50 లక్షల కళ్లద్దాలు అందించామని హరీశ్ రావు గుర్తు చేశారు. అదే ఉత్సాహంతో రెండో దశలో కూడా మరింత మందికి స్క్రీనింగ్ పరీక్సలు నిర్వహించాలని చెప్పారు. మొదటి దశలో పరీక్షలు చేసిన వారికి కూడా రెండో దశలో మరోసారి పరీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రతీ గ్రామ పంచాయతి, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన వారికి కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. మందులతో పాటు, కళ్లద్దాలు కూడా ఉచితంగా అందివ్వనున్నట్లు హరీశ్ రావు స్పష్టం చేశారు.

ఇప్పటికే అన్ని జిల్లాల్లో కంటి వెలుగును విజయవంతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. మొదటి విడత కంటి వెలుగు 8 నెలల పాటు కొనసాగిందని.. కానీ ఈ సారి 100 రోజుల్లోనే విస్తృతంగా పరీక్షలు చేయాలనే టార్గెట్ పెట్టినట్లు ఆయన చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు మరిన్ని బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 టీమ్స్ కంటి వెలుగు కోసం పని చేస్తాయని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు క్యాంపులను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రతీ టీమ్‌లో ఒక మెడికల్ ఆఫీసర్‌తో పాటు 8 మంది వైద్య సిబ్బంది ఉంటారని ఆయన్ వెల్లడించారు.

రాష్ట్రంలోని ప్రతీ వీధిలో ఉన్న వారికి కంటి పరీక్షలు చేసి.. అవసరమైన వారికి నెల రోజుల్లోనే వైద్యులు సూచించిన అద్దాలు పంపిణీ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 30 లక్షల రీడింగ్, 25 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. రోజు వారీ వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండానే ఈ కంటి వెలుగు నిర్వహించాలని వైద్యులకు సూచించినట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రతీ రేషన్ షాపు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో క్యాంపులు ఎప్పుడు నిర్వహించేది నోటీసులో తెలియజేస్తారని హరీశ్ రావు అన్నారు.

ఇక కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం కావడానికి విస్తృతమైన ప్రచారం నిర్వహించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కంటి సమస్యలతో ఎవరూ బాధపడకూడదనే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతీ ఒక్కరికి స్క్రీనింగ్ పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యేలా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News