గ్రూప్-1పై నేడు హైకోర్టు తీర్పు
ప్రిలిమ్స్ ఫైనల్ కీలోనూ ఏడు ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదన్న పిటిషనర్లు..మెయిన్స్‌కు ఇప్పటికే వేలాది సిద్ధమయ్యారని.. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకుంటే అభ్యర్థులు నష్టపోతారని సర్వీస్ కమిషన్ వాదన
గ్రూప్- ప్రిలిమ్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనున్నది. ప్రిలిమ్స్‌లో ఏడు ప్రశ్నలకు ఫైనల్ కీలోనూ సరైన సమాధానాలు ఇవ్వలేదని, ఆ ప్రశ్నలకు మార్కులు కలిపి జాబితా మరోసారి విడుదల చేయాలని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాల్లోని ప్రశ్నలపై ఆయా సబ్జెక్టుల నిపుణుల దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాతే ఫైనల్ కీ విడుదల చేశామని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. పరీక్షల నిర్వహణపై సర్వీస్ కమిషన్‌కు తుది అధికారం ఉంటుందని.. గ్రూప్ మెయిన్స్‌కు ఇప్పటికే 30 వేలకు పైగా అభ్యర్థులు సిద్ధమయ్యారని కోర్టుకు వివరించింది. ఈ దశలో హైకోర్టు జోక్యం చేసుకుంటే సన్నద్ధమౌతున్న అభ్యర్థులంతా నష్టపోతారని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును ఇప్పటికే రిజర్వు చేసింది.
మరోవైపు ఈ నెల 21 నుంచి 27వ వరకు మెయిన్స్ నిర్వహించడానికి సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హాల్‌టికెట్లు కూడా కమిషన్ వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో గ్రూప్ ప్రిలిమ్స్‌లో ఏడు ప్రశ్నల సమాధానాలపై పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, సర్వీస్ కమిషన్ వాదనలు విన్న కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నదనే ఉత్కంఠ నెలకొన్నది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఒకసారి, నిబంధనలు పాటించకుండా గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించిందని కోర్టు మరోసారి ఈ పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాని అక్కడా చుక్కెదురైంది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ లోగా ప్రభుత్వం మారింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన 508 పోస్టులతో కూడిన గ్రూప్-1ను రద్దు చేసి దానికి అదనంగా 60 పోస్టులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు కూడా ప్రిల్సిమ్స్‌లో ప్రశ్నలపై వివాదం కొనసాగుతున్నది. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.