టీచర్లకు నిరాశ.. 13 జిల్లాల్లో బదిలీలకు హైకోర్టు బ్రేక్
అయితే ఇప్పుడు మల్టీజోన్-2 పరిధిలోని 13 జిల్లాల్లో టీచర్ల బదిలీలు పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. అక్టోబర్-10 వరకు ఈ స్టే కొనసాగుతుంది.
తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. మల్టీజోన్-2లో బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈ జోన్ పరిధిలోని 13 జిల్లాల్లో బదిలీలు నిలిచిపోయాయి. అయితే, మల్టీజోన్1 పరిధిలోని 20 జిల్లాల్లో.. టీచర్ల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయి.
మల్టీజోన్1, 2 పరిధిలోని ఇప్పటికే గెజిటెడ్ హెడ్ మాస్టర్ల బదిలీలు ముగిశాయి. స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ, తుది జాబితాలు విడుదల చేశారు. అదే సమయంలో గెజిటెడ్ హెడ్మాస్టర్ల పోస్టుల ఖాళీల జాబితాను కూడా విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ జాబితాలపై అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈరోజే ఆఖరు.
అయితే ఇప్పుడు మల్టీజోన్-2 పరిధిలోని 13 జిల్లాల్లో టీచర్ల బదిలీలు పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. అక్టోబర్-10 వరకు ఈ స్టే కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లాలోని కొందరు టీచర్లు సీనియార్టీ జాబితాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కోర్టును ఆశ్రయించడంతో ఈ స్టే విధించింది ధర్మాసనం. ఈ 13 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి కొంతమంది టీచర్లు వచ్చినందున సీనియార్టీ జాబితాలు తిరిగి రూపొందించాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది. మల్టీజోన్ -2 పరిధిలోని 13 జిల్లాల్లో కొత్త సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసి, వీలైనంత త్వరగా, కోర్టుకు సమర్పించి స్టేను వెకేట్ చేయిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వారంలోపే ఈ ప్రక్రియను ముగిస్తామని అంటున్నారు. అప్పటి వరకు బదిలీలు, పదోన్నతులపై ఆశలు పెట్టుకున్న ఉపాధ్యాయులకు వేచి చూడాల్సిందే.