ఫార్ములా-ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు
ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది.కేటీఆర్ ఏ-1గా ఏసీబీ పేర్కొంది.
ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ-1గా ఏసీబీ పేర్కొంది. ఏ-2గా ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ-3గా బీఎల్‌ఎన్ రెడ్డి ఉన్నారు. ఓ ప్రయివేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఏసీబీ అధికారులు. కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. గవర్నర్ అనుమతితో తదుపరి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపక్రమించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫార్ములా – ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ కాసేపటి క్రితం అసెంబ్లీ లాబీలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చకు పెట్టే దమ్ము లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెడితే ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయించుకుంటారు. ముఖ్యమంత్రి లీకులిచ్చి రాజకీయ దుష్ర్పచారానికి పాల్పడుతున్నారు. ఫార్ములా ఈ రేస్, ఇతర స్కాములంటూ అసత్యాలను ప్రచారం చేసే కన్నా సభలో చర్చ పెడితే నిజాలు తెలుస్తాయి కదా..? చర్చ నాలుగు గోడల మధ్య కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. లీకు వీరుడు సీఎం ఇచ్చే లీకులే తప్ప నిజాలు అధికారికంగా చెప్పే దమ్ములేదు అని కేటీఆర్ అన్నారు.కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టంలోని పలు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహించారు. ఈ రేసులకు అప్పటి మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నిబంధనలు పాటించకుండా ప్రైవేటు సంస్థలకు నేరుగా నిధులు మంజూరు చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మాజీ మంత్రి అయిన కేటీఆర్‌పై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ అనుమతి కూడా తీసుకోవడం గమనార్హం.