ప్రివిలేజ్ నోటీసులతోనే మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం నిజాలు చెప్పింది
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మూసీ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం కానట్టు శాసన సభ, శాసన మండలిని ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని.. బీఆర్‌ఎస్ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌తోనే దిగివచ్చి మూసీ ప్రాజెక్టుపై వాస్తవాలను బయట పెట్టిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇది బీఆర్‌ఎస్ పార్టీ విజయమని అన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులో చిన్న భాగానికే రూ.4,100 కోట్ల రుణం ప్రపంచ బ్యాంకును కోరామని ప్రభుత్వం చెప్తోందని, అంటే మొత్తం ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టు ప్రిలిమినరీ రిపోర్టును చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారమే లక్ష్యంగా కనిపిస్తుందని తెలిపారు. డబ్బులు సంపాదించే అంశాలనే ప్రభుత్వం పీపీఆర్ లో ప్రస్తావించిందని తెలిపారు. మురుగునీటి ప్రాజెక్టుకు మాత్రమే ప్రపంచ బ్యాంకును రుణం అడిగామని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారని, పీపీఆర్ లో మాత్రం రియల్ ఎస్టేట్ చేస్తామని.. గొప్ప మాల్స్ కడుతామని.. వ్యాపారం చేస్తామని పేర్కొన్నారని తెలిపారు. పేదల భూములు లాక్కొని పెద్దలకు పంచేదే మూసీ ప్రాజెక్టు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పిందని, ఇన్ని రోజులు దాచిపెట్టిన విషయాలు ఈ వెలుగులోకి వచ్చాయన్నారు. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇంత కాలం ప్రజలను మభ్యపెట్టిందన్నారు.