రేవంత్‌ లీకు వీరుడు.. ఏ విషయం అధికారికంగా చెప్పే దమ్ములేదు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement
Update:2024-12-19 15:19 IST

రేవంత్‌ రెడ్డి లీకు వీరుడని.. ఏ విషయం అధికారికంగా చెప్పే దమ్ము ఆయనకు లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ లబీల్లో ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. ముఖ్యమంత్రి లీకులిచ్చి రాజకీయ దుష్ప్రచారానికి పాల్పడుతున్నాడని, అసెంబ్లీలో చర్చ పెడితే అసలు నిజాలేమిలో అందరికీ తెలిసి వస్తాయన్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే ఫార్ములా ఈతో పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్ని స్కాములపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ చేస్తున్న ఆరోపణల్లో నిజాలుంటే అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు పెట్టాలన్నారు. ఫార్ములా -ఈ రేస్‌ కేసులో విషయమే లేనప్పుడు కోర్టుకు వెళ్లి ముందస్తుగా బెయిల్‌ అడగాల్సిన అవసరమే లేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను పరిశీలిస్తే ఏ జడ్జి అయినా కేసును కొట్టేస్తారన్న నమ్మకం తనకుందన్నారు. కేబినెట్‌ మీటింగ్‌ అంటే గాసిప్‌ బ్యాచ్‌ లెక్క తయారైందన్నారు. నిజాలు చెప్పే దమ్ము లేకనే సీఎస్‌ లేఖ, అనుమతులు అంటూ లీసులు ఇస్తున్నారని తెలిపారు.

స్థానిక సంస్థల చట్ట సవరణలను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెస్తున్న ఈ చట్ట సరవరణలతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామన్న హామీ కూడా గంగలో కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీసీల ఓట్లు దండుకునేందుకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని హామీలిచ్చి.. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెస్తుందన్నారు. బీసీ కమిషన్‌ సిఫార్సులు, ట్రిపుల్ టెస్ట్‌ పాస్‌ కావాలనే కొత్త మెలికలను కాంగ్రెస్‌ తెరపైకి తీసుకువస్తుందన్నారు. రిజర్వేషన్ల పెంపు కోసం అవసరమైతే కేంద్రం వద్దకు వెళ్లి రాజ్యాంగ సవరణకు పట్టు పడుతామన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కలిస్తే పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ సాధ్యమేనన్నారు. బీసీలను మోసం చేసేందుకే స్థానిక సంస్థల చట్ట సవరణల ప్రతిపాదనలు తీసుకువస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై అసెంబ్లీలో డివిజన్‌ కోరుతామన్నారు. ప్రభుత్వం తెస్తున్న చట్టాలు అమలైతే బీసీలకు రిజర్వేషపన్లు దక్కకుండా పోయే ప్రమాదముందన్నారు.

Tags:    
Advertisement

Similar News